కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్‌

27 May, 2019 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ : రాజకీయాల్లో అవమానాలు సహజం.. జరిగిపోయిన దానిని వదిలేయండి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కష్టపడి పని చేద్దామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఏడు లోక్‌సభ స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. బీజేపీ ఏడు స్థానాల్లో భారీ మెజరిటీతో విజయం సాధించి ఢిల్లీలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం తొలిసారి కార్యకర్తలతో సమావేశమయ్యారు కేజ్రీవాల్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి లేదా జనాలతో కలిసి సాగుదామనుకునే వారికి అవమానాల్ని ఎదుర్కొనే ధైర్యం ఉడటం చాలా అవసరం అని అన్నా హజారే చెప్తుంటారు. మనం చాలా అవమానాల్ని చవి చూశాం.  వాటన్నింటిని చాలా గౌరవంగా స్వీకరించిన నా కార్యకర్తలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఫలితాల గురించి నిరాశ చెందవద్దు. భారీ ఎన్నికలు ముగిసాయి.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిలీ ప్రజల దగ్గరకు వెళ్లి ఒకే మాట చెప్పండి. పేరును కాకుండా పని చూసి ఓటు వేయండి అని ప్రచారం చేయండి’ అంటూ కార్యకర్తలకు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

అంతేకాక ‘పార్టీ పెట్టిన నాటి నుంచి మీరంతా నాతోనే ఉన్నారు. ప్రలోభాలకు లొంగలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదరలేదు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. గత ఎన్నికల్లో మన పార్టీ 54 శాతం ఓట్లు సాధించింది. ఈ సారి అంతకాన్న ఎక్కువ ఓట్లు సాధిస్తామనే నమ్మకం నాకుంద’న్నారు. ఈ సందర్భంగా రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి, కేజ్రీవాల్‌ శుభాకంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు