ఓటమిని ముందే అంగీకరించిన కేజ్రివాల్‌!

21 May, 2019 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం ఓటర్ల నుంచి మాకు ఎప్పుడూ మద్దతు ఉంది. ఈసారి కూడా వారి మద్దతుపైనే మేము ఎక్కువ ఆధారపడ్డాం. వారి మద్దతుతో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లను గెలుచుకోవాలనుకున్నాం. కానీ చివరి నిమిషంలో ముస్లింల మద్దతు కాంగ్రెస్‌ వైపు మళ్లింది అని తెల్సింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఆఖరివిడత పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే, 18వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటీ? లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేకపోతున్నామని ముందుగానే ఓటమిని అంగీకరించడమా? గెలవడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా జారీ పోయిందనా!

కారణం  ఏమైనా ఆయన ఓటమి ఖాయమైందన్న విషయం ఆ మరుసటి రోజు రాత్రి వెలువడిన ఎగ్జిట్‌ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ఇది రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓ సంకేతం కూడా. ఆప్‌ బలహీనపడిందనడానికి నిదర్శనం కూడా. ముస్లింలంతా కాంగ్రెస్‌ వైపు మళ్లారంటే అది కాంగ్రెస్‌ పార్టీకి శుభవార్తే. వారి మద్దతుతో ఢిల్లీలో ఒకటి, రెండు సీట్లను గెలుచుకునే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. అరవింద్‌ కేజ్రివాల్‌ వ్యాఖ్యలు ఆయన ఓటమిని సూచిస్తున్నాయని ‘సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’కు చెందిన ప్రవీణ్‌ రాయ్‌ జోస్యం చెప్పారు.

ముస్లిం ఓటర్లు ఆప్‌కు మద్దతివ్వకపోతే ఆ పార్టీ మద్దతు 15 శాతానికి పడిపోతుందని, ఆప్‌ తన ఓటమిని ఈవీఎంలపైకి నెట్టే అవకాశం ఉందని కూడా ప్రవీణ్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ జనాభాలో 13 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ముస్లిం ఓటర్లు ఆప్‌కే మద్దతిచ్చారు. దాంతో ఆప్‌కు ఓట్లు ఏకంగా 54.3 శాతం వచ్చాయి. పర్యవసానంగా 70 సీట్లకుగాను 67 సీట్లను గెలుచుకోగలిగింది. 2017లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ పోలింగ్‌ శాతం 26 శాతానికి పడిపోయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని కాంగ్రెస్‌ పార్టీతోని మున్సిపల్‌ ఎన్నికల్లో గట్టిపోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే మున్సిపల్‌ ఎన్నికల నుంచి బలపడిన కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే సముచితమని ముస్లిం ఓటర్లు భావించి ఉంటారు. అరవింద్‌ కేజ్రివాల్‌ ఇప్పటికే మేల్కొని ముస్లింలను దరిచేర్చుకునేందుకు సరైన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోక పోయినట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

>
మరిన్ని వార్తలు