బీజేపీపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

18 May, 2019 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కారణంగా ఏదో ఒకరోజు తాను కూడా ఇందిరా గాంధీలాగే హత్యకు గురవుతానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘బీజేపీ వాళ్లు ఏదో ఒకరోజు నన్ను చంపేస్తారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తరహాలోనే నా వ్యక్తిగత భద్రతా సిబ్బందే నన్ను హత్య చేస్తుంది. బీజేపీ వారి చేత ఈ పని చేయిస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలో కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌పై అనేక మార్లు  దాడులు జరిగిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత శనివారం కేజ్రీవాల్‌ ఒక రోడ్‌ షోలో ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ యువకుడు దాడి చేశాడు. హఠాత్తుగా ప్రచార వాహనం పైకి ఎక్కి ఆయనను కొట్టాడు. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కార్యకర్తలు వెంటనే తేరుకుని అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఇక కేజ్రీవాల్‌ చెబుతున్న ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై దాడి జరగడం ఇది తొమ్మిదోసారి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేసినప్పుడు ఆయనపై కొందరు దుండగులు దాడిచేశారు. రోడ్‌ షోలో మాట్లాడుతుండగా ఆయనపై కోడిగుడ్లు, ఇంకుతో దాడి జరిగింది. అదే సంవత్సరం అవినీతి వ్యతిరేకోద్యమం నాయకుడు అన్నాహజారే మద్దతుదారుడిగా చెప్పుకున్న ఒక వ్యక్తి కేజ్రీవాల్‌ మెడపై తీవ్రంగా కొట్టాడు. మరికొన్ని రోజులకు ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్‌ ఆయన చెంపపై కొట్టాడు. 2016లో ఢిల్లీలో రెండుసార్లు, పంజాబ్‌లోని లూథియానాలో ఒకసారి దుండగులు దాడి చేశారు. ఢిల్లీలో ఒక దుండగుడు ఇంకు జల్లితే, మరికొన్ని రోజులకు మరొకడు బూటు విసిరాడు. లూథియానాలో కర్రలు, ఇనుపరాడ్‌లతో దాడిచేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. రెండేళ్లక్రితం కేజ్రీవాల్‌ అభిమానిగా చెప్పుకున్న యువకుడు కాళ్లపై పడినట్టు నటిస్తూనే హఠాత్తుగా ఆయన మొహంపై కారం పొడి చల్లాడు. ఈ నేపథ్యంలో ప్రజల సానుభూతి పొందేందుకే కేజ్రీవాల్‌ స్వయంగా ఈ దాడుల నాటకం ఆడుతున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా... తనను భౌతికంగా అంతమొందించడం కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేతే తనను హత్య చేయిస్తారని ఆయన సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు