ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌

9 Feb, 2020 18:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 70స్థానాలున్న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి 24 గంటలయిన ఎన్నికల కమీషన్‌ మాత్రం అధికారికంగా పోలింగ్‌ శాతాన్ని ప్రకటించలేదు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా తామే గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా తుది పోలింగ్ శాతంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు తావిచ్చినట్లయింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల కమీషన్‌పై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.(కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ నేత ప్రశంసలు..)

'పోలింగ్ పూర్తయిన ఇన్ని గంటల తర్వాత కూడా ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయకపోవడం నాకైతే షాకింగ్గా అనిపిస్తోంది. అసలు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్లేమైనా నిద్రపోతున్నారా ఏంటి? పోలింగ్ శాతాన్ని ప్రకంచాలి కదా?' అంటూ సీఎం కేజ్రీవాల్ ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, ట్యాంపరింగ్ ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచుకుని, తద్వారా ఫలితాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.(బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు..)

శనివారం సాయంత్రానికి వెల్లడైన లెక్కల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 61.46 శాతం పోలింగ్ నమోదైంది. గత లోక్ సభ ఎన్నికలు, 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్‌ శాతం చాలా తక్కువగా ఉంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి 67.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా శాతం లెక్కలు పెరుగుతాయని ఈసీ అధికారులు చెప్పినా... అధికార లెక్కలు మాత్రం విడుదల చేయకపోవడం పట్ల విమర్శలకు దారి తీస్తోంది. (ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌, స్మృతి ఇరానీ ట్వీట్‌ వార్‌)

అయితే కేజ్రీవాల్‌ ఎలక‌్షన్‌ కమీషన్‌ తీరును తప్పు బట్టిన కాసేపటికే కేంద్ర ఎన్నికల​ సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5శాతం తగ్గిందని పేర్కొన్నారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే 2శాతం ఎక్కువగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో అత్యల్పంగా 45.4 శాతం, బల్లిమారన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6శాతం పోలింగ్‌ నమోదైందని ఈసీ తమ ప్రకటనలో తెలిపింది. 

>
మరిన్ని వార్తలు