16న కేజ్రీవాల్‌ ప్రమాణం

13 Feb, 2020 04:00 IST|Sakshi

వేదిక: రామ్‌లీలా మైదానం

భారీస్థాయిలో సన్నాహాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్‌ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.  అంతకుముందు కేజ్రీవాల్‌ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్‌ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు.  

భారీగా జన సమీకరణ
ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్‌ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్‌ ఆకర్షించారు.

కేబినెట్‌లో పాత ముఖాలే ?
గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్‌ కేబినెట్‌లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్‌ సిసోడియా, రాజేంద్ర పాల్‌ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్‌ గెహ్లాట్, గోపాల్‌ రాయ్, ఇమ్రాన్‌ హుస్సేన్‌లు కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్‌ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్‌ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్‌ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది.

మరిన్ని వార్తలు