కేజ్రీవాల్‌ వర్సెస్‌ రాహుల్‌ గాంధీ

21 Jun, 2018 16:45 IST|Sakshi
కేజ్రీవాల్‌-రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహ పూర్వకంగా కొనసాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే బీజేపీయేతర పార్టీలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చల్లో కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి కేజ్రీవాల్‌ని మాత్రం దూరంగా ఉంచుతోంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇంట్లో కేజ్రీవాల్‌ తొమ్మిది రోజుల పాటు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ధర్నాకు మమతా బెనర్జీ, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు, పినరయి విజయన్‌తో సహా ఎన్డీయేతర పార్టీలన్ని మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌ మాత్రం కేజ్రీవాల్‌ ధర్నాపై భిన్నంగా స్పందించింది. ప్రజల సమస్యలు గాలికొదిలేసి ఎల్జీ ఇంట్లో కూర్చోని సీఎం దీక్ష చేయడమేంటని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ విమర్శించారు. రాహుల్‌ గాంధీతో సహా అజయ్‌ మాకెన్‌ వంటి నేతలు ధర్నాపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు అన్ని ఒకటవుతుంటే కాంగ్రెస్‌, ఆప్‌ మాత్రం  పరస్పరం విరుద్ధంగా ఉంటున్నాయి.

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. కొద్దికాలానికే సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ ఆ తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలను క్లీన్‌ స్వీప్‌ చేసి ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ అనుసరించిన విధాన్నానే నేడు రాహుల్‌ అనుసరిస్తున్నారు. వీరిద్దరి మధ్య వైరం ఏంటో అంతుచిక్కని ప్రశ్న.

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమానికైన మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి, కుమార స్వామి, శరద్‌ పవార్‌ లాంటి నేతలకు ఆహ్వానం పంపుతున్న కాంగ్రెస్‌.. కేజ్రీవాల్‌ని  మాత్రం గత మూడేళ్లలో ఒక్కసారి కూడా దగ్గరకు తీయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికలనే లక్ష్యం‍గా పెట్టుకున్న కాంగ్రెస్‌ బిహార్‌, యూపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో జట్టు కడుతోంది. కేవలం ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాల్లోనే ప్రాబల్యం ఉన్న ఆప్‌తో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏవిధంగా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి.

మరిన్ని వార్తలు