‘ఇంటరే పాస్‌ అయ్యాడు.. ప్రధానిగా పనికి రాడు’

14 Feb, 2019 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ : గత ఎన్నికల్లో కేవలం ఇంటర్‌ పాస్‌ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి తప్పు చేయకండంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల ర్యాలీలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘గతంలో కేవలం ఇంటర్మీడియెట్‌ పాస్‌ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఎలాంటి కాగితాల మీద సంతకం పెడుతున్నాడో.. ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలంటే విద్యావంతుడైన ప్రధాని కావాలి. అందుకే ఈ సారి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు.

అంతేకాక గతంలో మాదిరిగానే ఇంటర్‌ పాస్‌ అయిన వ్యక్తిని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవద్దని తెలిపారు. అతను నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమర్థించారు.

మరిన్ని వార్తలు