కాంగ్రెస్‌కు ఆర్యవైశ్య మహాసభ మద్దతు

26 Oct, 2018 02:49 IST|Sakshi

కార్పొరేషన్‌ ఏర్పాటు హామీ పట్ల కృతజ్ఞతలు

ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని టీఆర్‌ఎస్‌ అవమానించిందని ఆవేదన  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి ఆర్యవైశ్య మహాసభ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేసి గెలిపించాలని ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మల్లికార్జున్, రాజకీయ కమిటీ చైర్మన్‌ చింతల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, ప్రతినిధులు నిరంజన్, పిల్లలమర్రి కిషోర్, ప్రతాప్‌ తదితరులు మాట్లాడారు.

ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటి చైర్మన్‌ దామోదర రాజనర్సింహను ఆర్యవైశ్యులు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఆవశ్యకతను వివరించగా సానుకూలంగా స్పందించారని, స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఆర్య వైశ్యుల సమస్యలు వినేందుకు కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కాంగ్రెస్‌ హామీని కాపీకొట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మోసపూరిత వాగ్దానం చేయడం హాస్యాస్పదమన్నారు.

ఇటీవల కొడంగల్‌ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆర్యవైశ్యులను కుక్కలుగా వ్యాఖ్యానించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రాజీవ్‌గాంధీ సద్భావనయాత్ర సందర్భంగా ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి చెందిన రోశయ్యకు అవార్డు ఇవ్వడం పట్ల ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. రోశయ్యను అవమానపర్చడం వైశ్య సామాజిక వర్గానికి జరిగిన అవమానమే అని పేర్కన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సినీనటి శైలజ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ కండువా వేసి శైలజను పార్టీలోకి ఆహ్వానించారు. 

మరిన్ని వార్తలు