కాంగ్రెస్, బీజేపీల అంతం ఖాయం

3 Mar, 2018 04:25 IST|Sakshi
ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న అసదుద్దీన్‌

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతాం

ఏఐఎంఐఎం 60వ వార్షికోత్సవ సభలో అసదుద్దీన్‌

సాక్షి,హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం లో కాంగ్రెస్, బీజేపీల అంతం ఖాయమని ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ–ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైద రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఏఐఎంఐఎం 60వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఒవైసీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బస్సు యాత్రలు, పాదయాత్రలతో కాంగ్రెస్, బీజేపీల పప్పులు ఉడకవని, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్‌–బీజేపీ దొందూ దొందేనని, షరియత్‌ సమస్య వస్తే కాంగ్రెస్‌లో గల ఒక్క ముస్లిం ఎంపీకి పార్లమెంట్‌లో నోరు విప్పేందుకు పార్టీపరంగా అనుమతి లేకుండా పోయిందన్నారు.

మోదీ హయాం.. కుంభకోణాల మయం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుంభకోణాల మయమైందని, వేల కోట్లు దిగమింగి, విదేశాలకు పారిపోతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా పోరుకు సిద్ధమేనని ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల బరిలో దిగామని, త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో రెండు లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తామని, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీని పరాజయం పాలు చేయడం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రో రైలు రావడం ఖాయమన్నారు. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌ పోర్టు వరకు ఒక లైన్, నాగోల్, మలక్‌పేట, పురానాపూల్‌ వరకు మరో లైన్‌ను సాధించి తీరుతామన్నారు.

70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేసింది శూన్యం
కాంగ్రెస్‌ 70 ఏళ్లలో మతకలహాలు తప్ప ముస్లిం వర్గాలకు చేసింది శూన్యమని మజ్లిస్‌ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. మజ్లిస్‌ పార్టీ 60 ఏళ్లలో యావత్‌ ముస్లింల గళంగా, బలంగా మారిందని గుర్తుచేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ మజ్లిస్‌ చలవేన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మిగతా రాష్ట్రాల్లో అమలుచేసి ఉండేదన్నారు. ఈ సభలో మజ్లిస్‌
ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు