రామ మందిరంపై ఒవైసీ సవాలు..

29 Oct, 2018 15:21 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాలు విసిరారు. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ.. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్‌ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. 

కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధాని మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి.. ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా  ప్రతిసారి, ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని బెదిరింపులకు పాల్పడతారని.. కానీ వారు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సవాలు విసిరారు.
 

సుప్రీం కోర్టు తీర్పుకు ముందు రామ మందిరం నిర్మాణంపై గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు