సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం

18 Feb, 2020 02:25 IST|Sakshi

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ 

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏ ఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. తెలంగాణ మంత్రివర్గ తీర్మానాన్ని ఆయన స్వాగతించారు. కేరళ మాదిరిగా జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)పై స్టే విధించాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు.

సోమవారం హైదరాబాద్‌ దారుస్సలాంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎన్‌పీఆర్‌పై కూడా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్‌పీఆర్‌కు జనాభా గణన, సాంఘిక సంక్షేమ పథ కాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది భవిష్యత్తులో నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) చేపట్టడానికి చేసే ప్రక్రియ అని తెలిపారు. ఢిల్లీ పోలీసులు జామియా మిలియా ఆవరణలోనే కాకుండా రీడింగ్‌ గదుల్లో సైతం చొరబడి విద్యార్థులను కొట్టారని, బయటకి వెళ్లకుండా అరాచకం సృష్టించినట్లు వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు