ఆర్డినెన్స్‌తో న్యాయం జరగదు: ఒవైసీ

20 Sep, 2018 02:18 IST|Sakshi

 ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమే 

సాక్షి, హైదరాబాద్‌: ట్రిఫుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు న్యాయం జరగదని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కేంద్ర మంత్రి వర్గం ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావడంపై మండిపడ్డారు. బుధవారం మజ్లిస్‌ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మహిళలకు ఆర్డినెన్స్‌ వ్యతిరేకమని, దానితో మరింత అన్యాయం జరిగే అవకాశమే ఉంటుందని అన్నారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్‌ కాంట్రాక్ట్‌ అని, ఇందులో ప్యానెల్‌ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని పేర్కొన్నారు.

ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమే అవుతుందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ కారణంగా కేసు నమోదైతే మహిళలకు అండగా నిలబడేది ఎవరని ప్రశ్నించారు. కేసుకు గురైన వ్యక్తి జైలుకు వెళ్తూనే భరణం ఎలా చెల్లిస్తారని, శిక్ష పూర్తయి బయటికి వచ్చేవరకు మహిళ చిక్కుల్లో పడాల్సిందేనా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను ఇక్కట్ల పాల్జేసేందుకు మోదీ సర్కార్‌ ఈ ఆర్డినెన్స్‌ తీసుకువస్తోందన్నారు. దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్తే ఆర్డినెన్స్‌ నిలబడదన్నారు. 

మరిన్ని వార్తలు