రజనీకాంత్‌ వ్యాఖ్యలపై మండిపడిన అసదుద్దీన్‌

14 Aug, 2019 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ-అమిత్‌ షాలను కృష్ణార్జునులుగా పోలుస్తూ.. రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, రజనీ వ్యాఖ్యలపై మండి పడ్డారు. మోదీ-అమిత్‌ షాలు కృష్ణార్జునులైతే.. మరి పాండవులు, కౌరవులు ఎవరు అని ఒవైసీ ప్రశ్నించారు. ఈద్‌ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఇప్పటికే రెండు చారిత్రక తప్పిదాలు నమోదయ్యాయి. ఒకటి 1953లో షేక్‌ అబ్దుల్లాను అరెస్ట్‌ చేయడం.. రెండు 1987లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటం. తాజాగా జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ.. మోదీ ప్రభుత్వం మూడో తప్పిదం చేసింది’ అన్నారు.

‘మోదీ చర్యలను ఓ తమిళ యాక్టర్‌ ప్రశంసిస్తూ.. మోదీ-అమిత్‌ షాలను కృష్ణార్జునులతో పోల్చాడు. మరి పాండవులు, కౌరవులు ఎవరు. దేశంలో మరో మహాభారత యుద్ధం జరగాలని వారు కోరుకుంటున్నారా’ అని ఒవైసీ ప్రశ్నించాడు. అంతేకాక నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌లకున్న రాజకీయ దూరదృష్టి ఇప్పటి పాలకులకు లేదన్నారు ఒవైసీ. ‘ఈ ప్రభుత్వానికి కశ్మీర్‌ ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ లేదు. వారు కేవలం అధికారాన్నే ప్రేమిస్తారు. పదవిలో కొనసాగడం కోసమే కశ్మీర్‌ను విభజించారు. ఈ ప్రభుత్వ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఒవైసీ తెలిపాడు. అంతేకాక జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు