‘ఏ పరిస్థితుల్లోనైనా ‘జై హింద్‌’ అనే అంటాను’

8 Mar, 2019 10:42 IST|Sakshi

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ‘ఆస్క్‌ అసద్‌’ పేరిట ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గురువారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకున్నారు. కశ్మీర్‌లో మూక దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. కశ్మీరీలు కూడా భారత్‌లో భాగమేనని తెలిపారు. హింసను అరికట్టడం, రాంబో విధానాలను తగ్గించడం ద్వారా మాత్రమే అక్కడి పరిస్థితులను చక్కదిద్దవచ్చని అన్నారు. తమ పార్టీ అందరి కోసం పోరాడుతుందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే తమ కోరిక అని పేర్కొన్నారు.

అంతేకాకుండా తానెప్పుడూ జాతీయ గేయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. దానిని పౌరులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను ‘జై హింద్‌’ అనే అంటానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరుతో భయం సృష్టించడం ఎప్పటికైనా ముప్పేనని చెప్పుకొచ్చారు.

మీరు ప్రధాని అయితే చేసే మొదటి పని ఏమిటని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. ఉన్నదానితో తాను సంతోషంగా ఉన్నట్టు పేరొన్నారు. మీరు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అవదలచుకున్నారా అని మరో నెటిజన్‌ అడగ్గా.. లేదని సమాధానం ఇచ్చిన అసద్‌, తెలుగు రాష్ట్రాలతోపాటు, యూపీ, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. చివరిగా ఆస్క్‌ అసద్‌లో పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతానని అన్నారు.

మరిన్ని వార్తలు