ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు; ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

25 Jul, 2019 17:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు.

మహిళలను మీరు శిక్షిస్తున్నారు..
‘స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ మీరు మాత్రం ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించాలని అనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మీరు సరికొత్త భారతాన్ని నిర్మించాలనే మాటకు కట్టుబడి ఉన్నారా! ట్రిపుల్‌ తలాక్‌ సరైంది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. జైలులో ఉన్న భర్త బయటికి వచ్చేదాకా విడాకులు పొందిన ఓ భార్యకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు. భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించి భార్యలను మీరు శిక్షిస్తున్నారు’ అని అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు.

వాళ్ల కోసమే ఈ బిల్లు..
లోక్‌సభలో చర్చ సందర్భంగా అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ స్పందించారు. ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య లేదా కూతురు ఒక్క ఫోన్‌ కాల్‌ ద్వారా విడాకులు పొందటాన్ని ఒవైసీ సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ‘ వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా విడాకులు ఇచ్చే వాళ్ల కోసమే ఈ బిల్లు. పళ్లు సరిగా లేవని, కూరలో తగినంత ఉప్పు వేయలేదని విడాకులు ఇస్తున్న మహానుభావులను చూస్తూనే ఉన్నాం కదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు