ఢిల్లీ అల్లర్లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

2 Mar, 2020 15:28 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి  ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగినవి మతపరమైన అల్లర్లు కాదనీ.. ముందస్తు ప్రణాళికతో చేసిన మరణకాండ అని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఘర్షణల్లో మృతిచెందిన అమాయక ప్రజల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు బీజేపీకి పలువురు నేతలు ప్రజలను చంపడానికి రెచ్చగొట్టారని మండిపడ్డారు. వారు స్వయంగా ఈ ప్రకటనలు చేశారా అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నేతలు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

ఈ మొత్తం ఘర్షణలకు ప్రభుత్వం సహకరించిందని అసదుద్దీన్‌ ఆరోపించారు.  జాతీయ గీతం పాడాల్సిందిగా నలుగురు యువకులపై పోలీసులు ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ నలుగురిలో ఓ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. ఓ మహిళను ఇంట్లోనే సజీవదహనం చేశారని, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి కూడా మరణించాడని గుర్తు చేశారు. 

కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరెగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 46 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ క్రైమ్‌ బాంచ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ ఘర్షణలపై విచారణ జరుపుతున్నాయి.(చదవండి : పక్కా ప్రణాళికతోనే ఢిల్లీ అల్లర్లు : దీదీ)

మరిన్ని వార్తలు