అమిత్‌ షాపై మండిపడిన ఒవైసీ

14 Sep, 2019 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదని.. వాటి కంటే ఎంతో భారత్‌ ఎంతో విశాలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ భారతీయులందరి మాతృభాష హిందీ కాదు. భరతభూమిపై ఎన్నెన్నో మాతృభాషలు ఉన్నాయి. వాటిలోని భిన్నత్వాన్ని, అందాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి. భారత రాజ్యాంగంలోని 29వ అధికరణ తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతీ సంప్రదాయాలు పాటించేందుకు అవకాశం కల్పిస్తుంది. హిందీ, హిందూ, హిందుత్వ కంటే ఇండియా చాలా పెద్దది’ అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా శనివారం హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..‘ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్‌ పటేల్‌ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్‌ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు