పార్లమెంటరీ విధానంలో మార్పు రావాలి

11 Mar, 2019 05:10 IST|Sakshi

యువతతో ‘టాక్‌ విత్‌ అసద్‌’

సాక్షి, హైదరాబాద్‌:  పార్లమెంటరీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సెక్యులరిజం మరింతగా పటిష్టం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చ పెరగాలని, ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధాని  నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం ఇక్కడి బిర్లా ఆడిటోరియంలో లెర్న్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టాక్‌ విత్‌ అసద్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువ త వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చా రు.

పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చిన ప్రజాసమస్యలపై ప్రధాని మోదీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ఉపన్యాసాలతో పక్కదారి పట్టించారని ఆరోపించా రు. ఐదేళ్లలో కశ్మీర్‌ సమస్య మరింత జఠిలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు కశ్మీరీలు వలస వెళ్లి జీవించే పరిస్థితి లేకుండా చేశారన్నారు. పుల్వామా ఉగ్రదాడికి పెద్దమొత్తంలో ఆర్డీఎక్స్‌ ఎలా వచ్చిందని ఎవరూ ప్రశ్నించడం లేదని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు రఫేల్‌ తప్ప ఇంకేమీ పట్టింపు లేద ని విమర్శించారు. పాలకులు మారుతున్నారే తప్ప మైనారిటీలకు ఒనగూరుతున్న అభివృద్ధి శూన్యమన్నారు.

కలసికట్టుగా ముందుకు వెళ్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణ యం తీసుకుంటునే సమర్ధవంతమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. రాజకీయాల్లో త్యాగా లు పనికి రావని, బతికి ఉండి ప్రజాసేవ చేయాలన్నారు. యువత టీవీలను వీక్షించడం తగ్గించి పత్రికలు చదివి మరింత జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఎంపీ కోటా నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఆరు రోజులు పార్టీ కార్యాలయమైన దారుస్సాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. యువత పోలింగ్‌ శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మరిన్ని వార్తలు