రంజాన్‌ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటి?

11 Mar, 2019 20:26 IST|Sakshi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలను రంజాన్‌ మాసంలో జరపడం ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని వస్తున్న వ్యాఖ్యానాలపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. రంజాన్‌ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూనే తమ పనులు చేసుకుంటారని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. రంజాన్‌ మాసంలో ఎన్నికలు జరగడం వల్ల ఓటింగ్‌ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఏ విధమైన కారణాలు ఉన్నప్పటికీ.. ముస్లింలను, రంజాన్‌ను వాటి కోసం వాడుకోరాదని విజ్ఞప్తి చేశారు. 

అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై స్పందించిన తృణమాల్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కోల్‌కత్తా మేయర్‌ ఫరీద్‌ హకీమ్‌.. ఏడు దశల్లో ఎన్నికలు జరపడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. రంజాన్‌ పర్వదినం రోజునే బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలోని కొన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడి ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం రాజ్యంగ బద్ధమైన సంస్థ అని.. మేము వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని తెలిపారు.

మరిన్ని వార్తలు