బుల్లెట్‌ పై ప్రగతి భవన్‌కు వచ్చిన ఒవైసీ!

10 Dec, 2018 14:17 IST|Sakshi
బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు వచ్చిన ఒవైసీ

సీఎం కేసీఆర్‌తో ఓవైసీ భేటి

హంగ్‌ వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా ఒక్కడే బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు వచ్చి ఆశ్చర్య పరిచారు. రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో చర్చించడానికి ఆయన ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ఒవైసీ.. దేవుడి ఆశీస్సులతో ఎవరి మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మజ్లిస్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేస్తూ ఈ సమావేశానికి ముందు ట్వీట్‌ చేశారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగని, తాను తెలంగాణ కేర్‌టేకర్‌ సీఎం కేసీఆర్‌ కలవబోతున్నట్లు పేర్కొన్నాడు.

ఇక ప్రజాకూటమిలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్‌ ఆహ్వానించడంపై ఇప్పుడేమీ మాట్లాడలేనని భిన్నవాదనలకు తెరలేపిన ఒవైసీ.. నేడు తమ మద్దతు కేసీఆర్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. హంగ్‌ వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడే క్రమంలో కేసీఆర్‌తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. ఎంఐఎం పార్టీని పక్కనబెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే టీఆర్‌ఎస్‌ మాత్రం మజ్లీస్‌తోనే తమ దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

చదవండి: కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఇప్పుడేమీ మాట్లాడను: ఒవైసీ

మరిన్ని వార్తలు