‘ఇద్దరు రాజు’లకు వ్యతిరేక పవనాలు

5 Apr, 2019 11:04 IST|Sakshi

తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ జిల్లాలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నవారు ఒకరు. ఎంతోకాలంగా రాష్ట్ర మంత్రిగా... కేంద్ర మంత్రిగా... ఎంపీగా... ఎన్నో పదవులు ఆయన అలంకరించారు. కానీ జనం కోసం ఈయనేమీ చేయలేదన్న అపప్రధ మాత్రం మూటగట్టుకున్నారు. ఇక రెండో వ్యక్తి పదవికోసం గెలిపించిన పార్టీని... నమ్మిన జనాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినవారు. ఈయన కూడా అభవృద్ధికోసమే ఈ మార్పు అని చెప్పి సొంత లాభం చూసుకున్నారు. జనం సమస్యలను గాలికొదిలేశారు. వీరిద్దరూ రాజ వంశీయులే. రాజులంటే ప్రజలకు అండగా నిలవాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. వారి సమస్యల్లో పాలుపంచుకోవాలి. వాటన్నింటికీ వీరు వ్యతిరేకం. అందుకే ఈ సారి ఎన్నికల్లో వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనం నుంచి వ్యతిరేకతను చవిచూస్తున్నారు. వీరి వైఖరి ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతోంది. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు చెందిన ఇద్దరు రాజులకు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీరు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా జనం వద్దకు వెళుతుంటే.. ఇన్నాళ్లూ ఏం చేశారని మళ్లీ ఓట్లడగడానికి వచ్చారంటూ ఒక రాజుని ప్రజలు నిలదీస్తున్నా రు. దీంతో ప్రచారంలోకి వెళ్లడమే మానేశారు మరొక రాజు. ఇదీ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుల పరిస్థితి. 1955 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పి.వి.జి.రాజు, పి.అశోక్‌ గజపతిరాజు అధిక ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ  ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ చూపించలేకపోయారు. ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీ కూతుళ్లు అశోక్, అదితి టిక్కెట్టు తెచ్చుకున్నారు.

ఇన్నేళ్ల పాలనపై ఇప్పుడు వ్యతిరేకత 
ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జిల్లా నుంచి ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతి విజయనగరం పార్లమెంట్‌కు చేసిందేమీ లేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలేదు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలలు ఉన్నా విజయనగరంలో ఏర్పాటు కాలేదు. ఇన్నాళ్లూ అశోక్‌గజపతిరాజుకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌ ద్వారా మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ కాలం గడిపారు. కనీసం తాను నివసించే బంగ్లా ఉన్న  విజయనగరం పట్టణాన్ని తాగు నీటి సమస్య వేధిస్తున్నా ఆయనకదేమీ పట్టలేదు. ఇవన్నీ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి ప్రతికూలతలుగా మారనున్నాయి. ప్రత్యర్ధి పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. కేవలం టీడీపీకి, రాజ వంశానికి ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే వీరిద్దరూ ఆధారపడాల్సి వస్తోంది.

సొంత ప్రాభవం లేని  బొబ్బిలి రాజు
2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్ రాజశేఖరరెడ్డి బొబ్బిలి రాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఈ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సుజయకృష్ణ రంగారావు గెలుపొందారు. ఆ తరువాత 2009లో కూడా వైఎస్‌ హయాంలోనే సుజయ్‌ గెలుపొందారు. 2014లో వైఎస్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నుంచి సుజయ్‌ పోటీచేసి గెలిచారు. అంటే వైఎస్ .రాజశేఖరెడ్డి, జగన్‌ల నేతృత్వంలోనే ప్రజలు బొబ్బిలి రాజును గెలిపించారు తప్ప ఆయన వ్యక్తిగత చరిష్మా ఏమీ లేదని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచింది లేదు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌ కుటుంబాన్ని సుజయ్‌ పదవి కోసం వంచించి, పార్టీ మారడంతో ప్రజలు ఛీదరించుకుంటున్నారు. 

అంతగా తలకెత్తుకున్న అభిమానమంతా ఒక్కసారిగా చల్లారిపోయిందనీ, తాము వైఎస్‌ కుటుంబానికి నేటికీ అండగా ఉంటామని స్థానిక ప్రజలు, నాయకులు ఇప్పటికీ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పిన సుజయ్‌ ఆ విషయాన్ని మర్చిపోయి సొంత ప్రయోజనాలకు పదవిని వినియోగించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆయనపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇటు పార్టీలోనూ సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పర్యటనకు వెళుతున్న సుజయ్‌కు అక్కడక్కడ జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా సుజయ్‌ పట్టించుకోలేకపోవడం ఆయనకు ప్రధాన అవరోధంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ధనాన్ని, రాజుల సంప్రదాయ ఓటింగ్‌ను నమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది.  

మరిన్ని వార్తలు