‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్‌’

11 Jul, 2020 14:54 IST|Sakshi

జైపూర్‌: బీజేపీ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేస్తుందని.. రాజకీయాలతో ఆటలాడుతుందని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే.. మరోవైపు బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసి.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు.

‘మా ప్రభుత్వం కరోనా కట్టడి కోసం పని చేస్తుండగా.. బీజేపీ మాత్రం సమస్యలను పెంచే విధంగా ప్రవర్తిస్తోంది. బీజేపీ అన్ని హద్దులు దాటింది. కానీ మేం ప్రజల కోసమే పని చేస్తామని దేశం మొత్తం తెలుసు’ అన్నారు అశోక్‌ గెహ్లోత్‌. అంతేకాక కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో అధికారం కోసం బీజేపీ ఏ విధంగా ప్రవర్తించిందో ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇస్తాం.. ఇతర సాయం చేస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోన్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి బీజేపీ అసలు రంగు బయటపడుతోంది’ అన్నారు. (పెద్దల పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!)

‘గోవా, మధ్యప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఇలానే చేసింది రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి గత నెల గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడు రాజస్తాన్‌లో కూడా అదే పద్దతి అవలంభించాలని చూస్తున్నారు. కానీ మేం వారికి తగిన గుణపాఠం చెప్తాం. ఏళ్లపాటు గుర్తుండిపోతుంది అన్నారు. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అహంకారానికి తగిన బుద్ధి చెప్తారు’ అని అన్నారు అశోక్‌ గెహ్లోత్‌.

మరిన్ని వార్తలు