గెహ్లాట్‌కే రాజస్తాన్‌ పగ్గాలు..!

14 Dec, 2018 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ :  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎంపికపై గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మధ్యప్రదేశ్‌ మాదిరిగానే, రాజస్తాన్‌కు కూడా సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సచిన్‌ పైలట్‌ను డిప్యూటి సీఎంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకు ముందే అశోక్‌ గెహ్లాట్‌,  సచిన్‌ పైలట్‌లను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయబోతున్నట్టు రాహుల్‌ గాంధీ హింట్‌ ఇచ్చారు. అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌లు తనకు రెండు వైపులా ఉన్న ఫోటోను ట్వీట్‌ చేస్తూ.. ‘ది యూనైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ రాజస్తాన్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు రాహుల్‌ గాంధీ. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ రాహుల్‌ ఇలాంటి ట్వీటే చేశారు. కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాలతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్‌ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు.

అయితే రాజస్తాన్‌ సీఎం పదవికి సీనియర్‌ నేత గెహ్లట్‌తో పాటు యువ నేత సచిన్‌ పైలట్‌ కూడా పోటీపడ్డారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీలో గత మూడు రోజులుగా చర్చలు నడిచాయి.  ఈ చర్చల్లో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను, సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాలను సమర్ధవంతంగా నడపడం సీనియర్లకే సాధ్యమన్నారు. ఈ రెండు కీలక రాష్ట్రాల నుంచి అత్యధిక లోక్‌సభ  స్థానాలను గెలుచుకోవాలంటే సీనియర్లకే అవకాశం ఇవ్వడం సముచితమని ఆమె వాదించారు.

అంతేకాక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అవసరమైన నిధుల సమీకరణ సీనియర్లకే సాధ్యమవుతుందని ఆమె రాహుల్‌ను ఒప్పించారు. దాంతో చివరకు అశోక్‌ గెహ్లట్ పేరును రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవిని కూడా పైలట్‌కే కట్టబెట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు