అసమర్థుడు.. పనికిరాని వాడు! 

21 Jul, 2020 04:05 IST|Sakshi

జైపూర్ ‌: తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌పై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోమవారం తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారు. ‘అసమర్ధుడు, పనికిరాని వాడు’ అంటూ నోరు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా పైలట్‌ పార్టీ కోసం ఏమీ చేయలేదని హిందీలో ‘నాకారా, నికమ్మా’ అంటూ దూషణలకు దిగారు. అయినా, పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఏమీ మాట్లాడలేదని, పీసీసీ చీఫ్‌ను మార్చాలని కోరలేదని వివరించారు. పైలట్‌ పేరును ప్రస్తావించకుండా, మాజీ యువ సహచరుడు అంటూ సంబోధించారు. ‘నేనేమైనా కూరగాయాలు అమ్మడానికి వచ్చానా? ముఖ్యమంత్రి కావడానికే వచ్చాను అనేవాడు’ అంటూ పైలట్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఒక పీసీసీ అధ్యక్షుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం బాధాకరం. నా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఫలించదు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీనే అది దెబ్బతీస్తుంది’ అని గహ్లోత్‌ మండిపడ్డారు. సాధారణంగా బీజేపీ, బీజేపీ ప్రభుత్వాల తరఫున న్యాయస్థానాల్లో వాదించే ముకుల్‌ రోహత్గీ, హరీశ్‌ సాల్వేలు పైలట్‌ తరఫున హైకోర్టులో వాదించడాన్ని గహ్లోత్‌ ప్రస్తావించారు. వారి ఫీజు కోట్లలో ఉంటుందని, ఆ మొత్తాన్ని పైలట్‌ స్వయంగా చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

30 కోట్లా.. 35 కోట్లా? 
బీజేపీలో చేరాలని కోరుతూ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు పైలట్‌ ప్రయత్నించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్‌ సింగ్‌ మలింగ ఆరోపించారు. ‘పైలట్‌జీ నాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని అడిగారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. బీజేపీలో చేరడం నాకు ఇష్టం లేదని చెప్పాను’ అని వివరించారు. ఈ విషయాన్ని వెంటనే సీఎం గహ్లోత్‌ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఎంత మొత్తం ఇస్తామన్నారు? రూ. 30 కోట్లా లేక రూ. 35 కోట్టా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం నడుస్తున్న రేటే అంటూ సమాధానమిచ్చారు. ఇవి నిరాధారమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని సచిన్‌ పైలట్‌ చెప్పారు.

ముందస్తు అనుమతితోనే సీబీ‘ఐ’
దర్యాప్తుల విషయంలో సీబీఐకి ఇచ్చిన ‘సాధారణ అనుమతి’ని రాజస్తాన్‌ ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకపై దాడులు చేయాలన్నా, ఎటువంటి విచారణ జరపాలన్నా, కేసుల వారీగా సీబీఐ ముందుస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెచ్చిన ఆడియో టేప్‌లు నకిలీవని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మరోసారి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా