గహ్లోత్‌.. అనే నేను

17 Dec, 2018 04:08 IST|Sakshi
ఆదివారం ఆల్బర్ట్‌ హాల్‌ వద్ద ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న గహ్లోత్‌

నేడు రాజస్తాన్‌ సీఎంగా ప్రమాణం

డిప్యూటీ సీఎంగా సచిన్‌ పైలట్‌

జైపూర్‌: చరిత్రాత్మక ఆల్బర్ట్‌ హాల్‌లో సోమవారం రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా సచిన్‌ పైలెట్‌ కూడా ప్రమాణం చేస్తారు. రాజస్తాన్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గహ్లోత్‌ నేడు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమక్షంలో అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని అశోక్‌ గహ్లోత్‌ తెలిపారు. సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు రాజ్‌భవన్‌లో నిర్వహిస్తారు. అయితే 2003, 2013లో వసుంధరారాజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆల్బర్ట్‌ హాల్‌ను ఖరారు చేశామని కాంగ్రెస్‌ ప్రతినిధి సత్యేంద్రసింగ్‌ రాఘవ్‌ మీడియాకు తెలిపారు.

వేడుక బహిరంగంగా జరపాలని నిర్ణయించడంతో 11 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అద్భుతమైన నిర్మాణ శైలికి ఆల్బర్ట్‌ హాల్‌ ఒక ఉదాహరణ. 1876లో వేల్స్‌ యువరాజు ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ జైపూర్‌ సందర్శన సందర్భంగా ఈ భవనానికి పునాది పడింది. 1887లో నిర్మాణాన్ని పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు