సోనియా ఇంటి ముందు ఆందోళన.. సంచలన ఆరోపణలు

2 Oct, 2019 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్ల పంపిణీ అంశం కాంగ్రెస్‌ పార్టీని ఓ కుదుపు కుదుపుతోంది. టికెట్ల పంపిణీ వ్యవహారంలో తీవ్ర అంసతృప్తితో ఉన్న హరియాణా కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అశోక్‌ తన్వార్‌ బుధవారం ఏకంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ఎదుట కూడా ఆయన నిరసన ప్రదర్శన చేపట్టారు. సోనియా ఇంటి ముందు ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

సోహ్నా అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేతలు రూ. 5 కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. టికెట్ల పంపిణీలో అన్యాయం జరుగుతుందని, ఈవిధంగా టికెట్లను అమ్ముకుంటే పార్టీ ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. టికెట్ల పంపిణీ విషయంలో పార్టీకి ద్రోహం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయినవారు 14మంది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, బీజేపీ ఎంపీల్లో ఏడుగురికి కాంగ్రెస్‌ నేపథ్యముందని తెలిపారు. గత మూడు నెలల్లో తనను బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఆరుసార్లు ఆఫర్‌ ఇచ్చారని, అయినా, తాను కాంగ్రెస్‌ను వీడబోనని, పార్టీ కోసం గత ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని టికెట్ల పంపిణీలో విస్మరిస్తున్నారని అశోక్‌ తన్వార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు