అధ్యక్షుడిగా నేనుంటా; రాహుల్‌కు ఖాన్‌ లేఖ

7 Jun, 2019 20:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలని హాకీ ఒలింపియన్‌, కేంద్ర మాజీ మంత్రి అస్లామ్‌ షేర్‌ ఖాన్‌ కోరారు. రెండేళ్ల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీకి ఆయన లేఖ రాశారు. పార్టీకి ముందుకు నడిపేందుకు ఎవరూ ముందుకు రాకుంటే, కొత్త అధ్యక్షుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. రెండేళ్ల పాటు పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు, పార్టీకి సేవలు అందిచేందుకు సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడిగా గడించిన అనుభవం తనకు ఉపకరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదనుగుణంగా వ్యూహాలు రచించినప్పుడే భవిష్యత్‌లో విజయాలను అందుకోలగలమని లేఖలో వివరించారు. మూలాల్లోకి వెళ్లి ఆత్మపరిశీలన చేసుకుని సామాన్య ప్రజలకు చేరువైతేనే బీజేపీకి సమానంగా ఎదుగుతామని అభిప్రాయపడ్డారు. 1975 హాకీ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత జట్టు వెనుకబడినప్పుడు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లను బరిలోకి దింపి విజయం సాధించి, తర్వాత టైటిల్‌ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇండియా గెలిచిన వరల్డ్‌కప్‌ ట్రోఫి టైటిల్‌ ఇదొక్కటేనని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని, తన కుటుంబానికి చెందని వారికి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్టు రాహుల్‌ గాంధీ చెప్పడంతో ఈ లేఖ రాసినట్టు అస్లామ్‌ షేర్‌ ఖాన్‌ తెలిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్‌ ఇష్టపడకపోతే ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు