మీరొస్తేనే కష్టాలు తీరతాయి

20 Aug, 2018 03:12 IST|Sakshi
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం సుబ్బారాయుడు పాలెంలో ప్రజల సమస్యలు వింటూ పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష 

పల్లెల్లో పొంగిన ఆనందం..అడుగులో అడుగేసిన జనం 

మరోవైపు గుండెను పిండేసే గాథలు..

చదువుకు ఫీజులే శాపమని వాపోయిన పేదలు 

వేధింపులు మితిమీరాయన్న బాధితులు

ఏకబిగిన సాగిన పాదయాత్రలో అందరి కష్టాలూ విని ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కారు మబ్బులు కమ్మిన వాతావరణంలోనూ దారిపొడవునా పల్లెలు పులకరించాయి. అభిమాన జన తరంగం జగన్‌ వెంటే నడుస్తూ జేజేలు పలికింది. హారతులు పట్టింది. ఆత్మీయతను పంచింది. గుండె గొంతుకను విప్పుకుని కష్టాల కడగళ్లు చెప్పుకుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం పట్టణ శివారు పెదబోడేపల్లి నుంచి సుబ్బారాయుడుపాలెం, చంద్రయ్యపాలెం, వజ్రగడ్డ క్రాస్, తమ్మయ్యపాలెం, జోగివానిపాలెం క్రాస్‌ మీదుగా ధర్మసాగరం క్రాస్‌ దాకా ఆదివారం సాగిన 240వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఆద్యంతం ఇదే ఒరవడి కనిపించింది. మీరొస్తేనే తమ కష్టాలు తీరతాయని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షించారు.  క్రితం రోజు (శనివారం) జగన్‌ నర్సీపట్నంలో వర్షంలో తడుస్తూ నే పాదయాత్ర చేశారు. జోరు వానలోనే బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కారణంగా  ఆదివారం జలుబు, జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ జన ప్రవాహంతో రెట్టించిన ఉత్సాహం కూడదీసుకుని ముందు కు సాగారు. వర్షం పడే సూచనలుండటంతో ఆయన భోజన విరామం కూడా ఇవ్వకుండా ఏకబిగిన తొమ్మిది కిలోమీటర్లు నడిచారు.  

చదవాలనుంది.. సహకరించేదెవరు? 
కార్పొరేట్‌ కాలేజీల ఫీజుల భారం పేదవాడికి శాపంగా మారుతోందని అనేక మంది వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. మాకవరపాలెం మండలం చంద్రియపాలెంకు చెందిన హిమబిందు, గాయత్రిల పరిస్థితి గురించి వారి కుటుంబీకులు జన నేతకు చెప్పుకున్నారు. పది పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ చూపించినా, ఇంటర్‌ ఫీజు కట్టలేక చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని బావురుమన్నారు. నవరత్నాల గురించి విన్నాక కొంత ధైర్యమొచ్చిందని చెప్పారు. పేదవాడికి చదువు భరోసా ఇచ్చే ఈ పథకాలు అమలవ్వాలంటే జగనన్న అధికారంలోకి రావాల్సిందేనని వారు అన్నారు. కుటుంబ పోషణ భారమైనా కూతురును ఇంటర్‌ వరకూ చదివించానని కొయ్యూరు మండలం మర్రిపాలెంకు చెందిన కోలా లక్ష్మి చెప్పింది. భర్త ఆదరణ లేని తాను బిడ్డకు పై చదువులు చెప్పించలేకపోతున్నానని బావురుమంది.  

చంద్రబాబు నమ్మించి మోసగించారు 
చంద్రబాబు మాటల గారడీతో మోసపోయామని, నాలుగేళ్లుగా కష్టాలనుభవిస్తున్నామని పలువురు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కంటితడి పెట్టిన వాళ్లల్లో నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళలు ఉన్నారు. 17 ఏళ్లుగా వైద్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న తమకు ఇప్పుడు ఉద్యోగ భద్రత కరువైందని పారా మెడికల్‌ సిబ్బంది వాపోయారు. మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన అన్‌రాక్‌ కంపెనీని తెరిపించాలని స్థానికులు కోరారు. 10 వేల మందికి ఉపాధి కల్పించే ఈ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోడూరు గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన జగన్‌ మాటపై పూర్తి విశ్వాసం ఉందని సీపీఎస్‌ వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అన్నారు. పింఛన్లు అందడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని దారిపొడవునా అనేక మంది జగన్‌కు తమ గోడు చెప్పుకున్నారు. అందరి కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగారు.  

వెంకటలింగం.. బాగున్నావా..? 
చిన్ననాటి మిత్రుడితో జననేత మాటామంతీ 
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1979 – 89 మధ్య తనతో కలిసి టెన్త్‌ వరకు చదువుకున్న చిన్ననాటి మిత్రుడు కె.వెంకటలింగంను ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో గుర్తించి ఆప్యాయంగా పలకరించారు. విశాఖ జిల్లా పెదబొడ్డేపల్లి వద్ద ఆదివారం ఈ సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర సాగుతుండగా.. జనంలో ఉన్న వెంకటలింగంను జగన్‌ గుర్తించి దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. పాదయాత్రలో అతన్ని వెంట పెట్టుకుని కిలోమీటర్‌ మేర నడిచారు. ప్రస్తుతం పాడేరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటలింగం.. వైఎస్‌ జగన్‌ తనను గుర్తించి పలకరించడంతో మురిసిపోతూ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్‌లో తాను హాస్టలర్‌గా, జగన్‌మోహన్‌రెడ్డి డే–స్కాలర్‌గా ఉండేవారమన్నారు. వరప్రసాద్, రామారావు, సుధాకర్‌ తదితరులమంతా ఫ్రెండ్లీగా ఉండేవారమన్నారు. వైఎస్‌ జగన్‌.. నాగార్జున హౌస్‌ కెప్టెన్‌గా, కబడ్డీ జట్టు కెప్టెన్‌గా, డిప్యూటీ హెడ్‌ బాయ్‌గా ఆనాడే నాయకత్వ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. 

వైఎస్‌ రుణ మాఫీ చేయకపోతే ఆస్తులు అమ్మేసే వాళ్లం 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2004లో రుణమాఫీ చేయడం వల్ల నాకు లక్ష రూపాయల బ్యాంకు అప్పు మాఫీ అయింది. లేకపోతే అసలు, వడ్డీ కట్టలేక అప్పుల పాలై ఆస్తులమ్ముకునే వాళ్లం. మా ఊళ్లో ఎంతో మందికి రుణమాఫీ అయింది. ఆ మహానుభావుడు అప్పట్లో నాకు రూ.200 పింఛన్‌ కూడా మంజూరు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలి. జగన్‌ బాబు వస్తేనే ఆ కల నిజమవుతుంది. 80 ఏళ్ల వయసులో నా చివరి కోరిక అదే. 
– చిటికెల సన్యాసినాయుడు, జేపీ అగ్రహారం  

మిమ్మల్ని గెలిపించుకుని తీరాలి.. 
గతంలో జగన్‌ బాబుకు అన్యాయం చేసి ప్రజలు చాలా తప్పు చేశారు. అందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఈసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేయకపోతే అందరం పూడ్చుకోలేనంతగా నష్టపోతాం. చంద్రబాబు చేసిన మోసాలు అందరికీ తెలిశాయి. నవరత్నాల పథకాలు చాలా బావున్నాయని ప్రజలందరూ చెబుతున్నారు. ఈ సారి తప్పకుండా మీరు గెలుస్తారు.   
– బంగారు చినతల్లి, తమ్మయ్యపాలెం

ఓటు తొలగించారు.. 
నాది నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో శివపురం. మొన్నటి వరకు టీడీపీలో క్రియాశీలకంగా తిరిగే వాడిని. అక్కడ ఎలాంటి గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదు. వైఎస్‌ జగన్‌ పోరాట పటిమ చూసి ఆకర్షితుడినై వైఎస్సార్‌ సీపీలో చేరాను. ఇది జరిగిన కొద్దిరోజులకే ఓటర్ల జాబితా నుంచి నా పేరు తొలగించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. కక్ష సాధింపు చర్యగానే నా ఓటు తొలగించారు. ఈ విషయాన్ని జగన్‌ గారికి చెప్పాను. గట్టిగా పోరాడదాం.. అని జగననన్న భరోసా ఇచ్చారు.   
 – అవుగడ్డ సత్యనారాయణ 

మరిన్ని వార్తలు