జనసేనలో లుకలుకలు

23 Jul, 2018 11:31 IST|Sakshi

ఒక వర్గానికే పెత్తనంపై గుర్రు

జిల్లా కార్యాలయంలో దళిత నేతపై దౌర్జన్యం!

ఏలూరు టౌన్‌ :  సమాజంలో మార్పుకోసమంటూ...పేద, బలహీన, దళిత వర్గాల అభ్యుదయవాదిగా చెప్పుకుంటూ పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి ప్రజా క్షేత్రంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక రెండురోజుల్లో పశ్చిమలో పవన్‌ పర్యటన సైతం ఖరారైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ అభిమానులుగా, కాపు సామాజికవర్గంలో నాయకుడిగా ఉన్న జల్లా హరికృష్ణ ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ జనసేనకు ఝలక్‌ ఇచ్చి టీడీపీలో చేరిపోగా, తాజాగా ఎస్సీ సామాజివర్గానికి చెందిన యువనేత సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదివారం సాయంత్రం ఏలూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఎప్పటినుంచో వపన్‌కళ్యాణ్‌కు వీరాభిమానిగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటే ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఒక ఎస్సీ యువ నాయకుడికి సమావేశంలో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోగా, అధినేత సామాజికవర్గానికి చెందిన నేతలు అతనిపై గొడవ దిగి బయటకు నెట్టి వేసినట్లు తెలుస్తోంది. తాను ఎస్సీ కావటం వల్లే చిన్నచూపు చూస్తున్నారని ఆ యువ నాయకుడు ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఇక మరో యువనేతపైనా పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడడం, కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేయటంపై పార్టీలో విభేదాలకు అద్దం పడుతున్నాయి. 

మరిన్ని వార్తలు