‘సెలెక్ట్‌ కమిటీపై టీడీపీ తీరు ఆశ్చర్యకరంగా ఉంది’

4 Feb, 2020 16:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని, అసెంబ్లీ సెక్రటరీ మీద మంత్రులు ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిబంధలన ప్రకారం సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. అధికారపక్షం రూల్ ప్రకారం వెళ్లమంటే.. ప్రతిపక్షం మాత్రం రూల్ అమలు చేయొద్దనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్‌కి ఉన్నట్టే ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘యనమల రామకృష్ణుడు తను మాత్రమే తెలివైనవాడిని అనుకుంటారు. అది మన ఖర్మ..!’ అని బొత్స ఎద్దేవా చేశారు.

ఆ విషయం కేంద్ర ఎప్పుడో చెప్పింది..
రాజధాని  వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉందని, కానీ చంద్రబాబు ఒక్కో జిల్లాకు రూ.350 కోట్లు సరిపోతాయని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆ నిధులను కూడా దారి మళ్లించారని వెల్లడించారు. విజయనగరం జిల్లాకు ఇచ్చిన నిధులు అశోక్ గజపతిరాజు కోట సుందరీకరణ కోసం వాడారని తెలిపారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు ద్రోహం చేసాడని, ఆయన చేసిన తప్పును కేంద్రానికి వివరించి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని బొత్స పేర్కొన్నారు. 2 లక్షల 50 వేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ఈఎంఐలు కట్టకుండా ఎగ్గొట్టాడని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు