ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై గౌరవం తగ్గలేదు: కేసీఆర్‌

27 Sep, 2018 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: భారత దేశ అణుశక్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బీహార్‌ వాజ్‌పేయి అని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని సీఎం హోదా కేసీఆర్‌ శాసన మండలిలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయి విలక్షణమైన నేత, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని జవహర్‌ లాల్‌ నెహ్రు ముందే చెప్పారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఏ మ్రాతం గౌరవం తగ్గలేదన్నారు.

బతికున్నప్పుడే భారతరత్న వచ్చిన కొద్దిమందిలో వాజ్‌పేయి ఒకరని తెలిపారు. దేశానికి ఉత్తమమైన పాలన అందించిన గొప్ప నేత వాజ్‌పేయిఅని ప్రశంసించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మంచిపని చేసే వారిని పొగిడేవారని గుర్తుచేశారు.  ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు.

‘వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలి పక్షాన వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను ’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు