కవిగా అజరామరుడైన వాజ్‌పేయి

16 Aug, 2018 15:12 IST|Sakshi

అటల్‌ బిహారీ వాజపేయి రాజకీయ వేత్తగా కంటే సాహితీ వేత్తగా, కవిగా ప్రాచుర్యం పొందారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనలోని కవిని గౌరవించేవారు.ఆయన ప్రసంగాలు కూడా కవితాత్మకంగా ఉండటం ఆయనలోని కవితాభినివేశానికి నిదర్శనం.’నువ్వు ఏదో ఒక రోజు మాజీ ప్రధానివి కావచ్చు.అయితే, మాజీ కవివి మాత్రం ఎప్పటికీ కాలేవు.అని వాజ్‌పేయి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయనలోని సాహిత్య ప్రతిభను గౌరవిస్తూ అందరూ అటల్‌జీ అని పిలిచేవారు. తన కవితలు, వ్యాఖ్యల ద్వారా ఆయన ఎందరినో ఉత్తేజితుల్ని చేశారు. మరెందరిలోనో ధైర్య సాహసాలు నింపారు. బుధవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వాజపేయి వ్యాఖ్యల గురించి ప్రస్తావించారంటే ఆయన దేశ రాజకీయాల్లో కవిగా ఎంత బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతోంది.నిరాశావాదాన్ని పారదోలాలని చెబుతూ...’

మధ్యాహ్నాం పూట చీకటి ఆవరించింది,
సూర్యుడు తన నీడచేత పరాజితుడయ్యాడు.
నీ హృదయం నుంచి తైలం పిండి దీపాన్ని వెలిగించు
మరో దీపం వెలిగించేందుకు కదిలిరా... అంటూ పిలుపు నిచ్చారు.

మరో సందర్భంలో...
ప్రభూ..
నన్నెప్పుడూ అత్యున్నత స్థాయికి చేరనివ్వకు
అక్కడుండి ఇతరులను ఇబ్బంది పెట్టలేను
అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుడిని చేయి..అన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే వాజపేయి కవితలు జీవిత సత్యాలను వెల్లడిస్తాయి. చట్ట సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆశువుగా కవితలల్లి సభ్యులను రంజిపచేయడం వాజపేయికి వెన్నతో పెట్టిన విద్య.
మరణాన్ని కూడా ఆయన కవితాత్మకంగా ఇలా చిత్రించారు.

’చావు ఆయుష్షు ఎంత?  రెండు క్షణాలు కూడా ఉండదు
జీవితమన్నది ప్రగతిశీలం..అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’

మరిన్ని వార్తలు