తలవంచని కవి

17 Aug, 2018 04:32 IST|Sakshi

కవిగా, రాజకీయవేత్తగా వాజ్‌పేయి ధోరణి అదే. తల వంచని ధోరణి. తలపడే ధోరణి.
శిథిల స్వప్నాల నిట్టూర్పు ఎవరు వింటారు.. కనురెప్పలపై తారాట్లాడే వ్యథను ఎవరు కంటారు.. వద్దు.. ఓటమి వొప్పుకో వద్దు పాడుతూనే ఉందాం కొత్తపాట..
తన ఉపన్యాసాలతో మాటలతో చేతలతో కూడా ఇలాంటి స్ఫూర్తినే వాజ్‌పేయి ఎప్పుడూ ఎదుటివారిలో నింపుతూ వచ్చారు. వాజ్‌పేయి తనను తనలోని కవిని ఎంత నిరాడంబరంగా ఉంచాలనుకున్నారంటే తాను ప్రధాని అయినప్పుడు తన పరిస్థితిని శిఖరంతో పోలుస్తూ ‘శిఖరం ఒంటరిది... ఎవరూ రారు హత్తుకోవడానికి... అధిరోహించడానికి బాగుంటుంది... కాని తోడు నిలవడానికి ఒక్కరూ ఉండరు’అని రాశారు. ‘ఒకనాటికి నేను మాజీ ప్రధానిని కావచ్చు... కాని మాజీ కవిని మాత్రం కాలేను’అని తన శాశ్వత కవి హోదాను చూసి పొంగిపోయారాయన.  

‘నడి మధ్యాహ్నామే నిశి ఆవరించింది
సూర్యుడు తన నీడచే పరాజితుడయ్యాడు.
నీ హృదయాన్నే వత్తిగా చేసి దీపాన్ని వెలిగించు
తోడు మరిన్ని దీపాలు వెలిగించేందుకు కదిలిరా’... అంటూ రాశారాయన.
నన్ను క్షణక్షణం జీవించనీ... కణకణంలోని సౌందర్యాన్ని జుర్రుకోని’అని రాసిన వాజపేయి జీవితాన్ని ధనాత్మకమైన కానుకలా పరిగణిస్తూ అలా జీవించడానికే ఇష్టపడ్డారు.
చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు’అన్న వాజపేయి ‘జీవితమన్నది ప్రగతిశీలం. అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’అని హితవు చెప్పారు.
అంతిమంగా మృత్యువు అనే కవితను ముద్దాడిన ఈ కవి చాలాకాలం తన కవిత్వంతో సజీవ పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాడు.  

కవిగానే కాదు వక్తగా కూడా ఆయన మాటలతో చాలనం చేసేవారు. వాక్కును ఖడ్గంలా వాడేవారు. కవితాత్మకంగా సాగే ఆయన ప్రసంగాలను పార్లమెంటులో విపక్షాలు కూడా శ్రద్ధగా ఆలకించేవి. ఆయన కవిత్వం జాతీయవాదాన్ని ప్రేరేపించేది. మానవతా విలువల్ని పాదుకొల్పే విధంగా ఉత్తేజితం చేసేది. కవిత్వం ప్రజల్లో కర్తవ్యాన్ని తట్టిలేపాలని, సామాజిక బాధ్యతను గుర్తు చేయాలని వాజ్‌పేయి నమ్మేవారు. హిందూ పురణాల స్ఫూర్తి వాజ్‌పేయి కవితల్లో కనిపించేది.

తేలిక పదాలతో, అందరికీ అర్థమయ్యేలా ఆయన రాసిన కవితలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, చరిత్రను, కీర్తి ప్రతిష్టలను ప్రస్తుతించడానికి పదం కలిపేవి. వాజ్‌పేయి కవితలను ఇంగ్లీషులోకి అనువదించిన భగవత్‌.ఎస్‌ గోయల్‌ వాజ్‌పేయి గురించి చెబుతూ, ‘వాజ్‌పేయి రాజకీయాలు, సాహిత్యం ఒకదాన్నొకటి సుసంపన్నం చేసుకుంటాయి. ఒక సాహితీవేత్త రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు మరింత శుద్ధమవుతాయని ఆయన నిరూపించారు. సాహితీ నేపథ్యం ఉన్న రాజకీయవేత్త మానవ విలువల్ని ఉద్వేగాల్ని అలక్ష్యం చేయజాలడని వాజపేయి నమ్మేవారు’అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలని వాజ్‌పేయి కవితను, జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.

జైలులో కవితా రచన
వాజ్‌పేయికి పదాలతో ప్రతిస్పందన తెచ్చే విద్య పాత్రికేయుడిగా ఉన్న నాటి నుంచి ఉంది. హిందీ మాస పత్రిక రాష్ట్ర ధర్మ, హిందీ వారపత్రిక పాంచజన్య, దినపత్రిక స్వదేశ్, వీర్‌ అర్జున్‌లకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు ‘ఖైదీ కవిరాజ్‌ కీ కుందలియా’పేరుతో కవితలు రాశారాయన. ఆ కవితలను 1994లో ‘అమర్‌ ఆగ్‌ హై’పేరుతో సంకలంగా తెచ్చారు.

తన పార్లమెంటు జీవితంపై ‘మేరీ సన్సదీయ యాత్ర’పేరతో నాలుగు సంపుటాలు రచించారు. ‘మేరీ ఇక్కవాన్‌ కవితా’,‘సంకల్ప్‌ కాల్‌’, ‘శక్తి సే శాంతి’, ‘ఫోర్‌ డెకేడ్స్‌ ఇన్‌ పార్లమెంట్‌ (పార్లమెంటు ప్రసంగాలు),‘లోక్‌సభ మే అటల్‌జీ’(ప్రసంగాల సంకలనం),‘మృత్యు యా హత్య’, ‘అమర్‌ బలిదాన్‌’, ‘జన్‌సంఘ్‌ ఔర్‌ ముసల్మాన్‌’, ‘క్యా ఖోయా క్యా పాయా’, ‘కుచ్‌ లేఖ్‌..కుచ్‌ బాషన్‌’, ‘నయీ చునోతి– నయా అవసర్‌’తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారి అశేషసాహితీ ప్రియుల మనసులను దోచాయి.  

కుమరకోం మ్యూజింగ్స్‌
2000 డిసెంబర్‌ 26 నుంచి 2001 జనవరి1 వరకు వాజ్‌పేయి కేరళలోని కుమరకోం రిసార్ట్స్‌లో గడిపారు.అక్కడ ఆయన మ్యూజింగ్స్‌ రాశారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తన మ్యూజింగ్స్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా కశ్మీర్‌ సమస్య, అయోధ్య వివాదాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. గతం నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి, బంగరు భవిష్యత్తువైపు పయనించడానికి తగిన సమయం ఆసన్నమైందని ఆ మ్యూజింగ్స్‌లో పేర్కొన్నారు.


బాలీవుడ్‌ గాయకుల నోట వాజ్‌పేయి పాట...
అటల్‌ బిహారీ వాజపేయి రాసిన కవితల్లో కొన్నింటిని బాలీవుడ్‌ గాయకులు పాడారు. ఆ పాటలు కూడా విశేష జనాదరణ పొందాయి.వాటిలో కొన్ని....

క్యా ఖోయా క్యా పాయా
ఈ కవితను స్వర్గీయ జగ్జీత్‌ సింగ్‌ ఆలపించారు.1999లో షారూక్‌ ఖాన్‌ మీద ఈ పాటను చిత్రీకరించారు. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఈ పాట ప్రజల మనసుల్లోంచి చెక్కు చెదరలేదు. జీవితంలో మనిషి ఎదుర్కొనే ఆటుపోట్లను వాజ్‌పేయి ఈ కవితలో చిత్రించారు.

దూర్‌ కహి కోయి రోతా హై
2002లో వచ్చిన సంవేదన ఆల్బమ్‌లో ఈ పాటను జగ్జీత్‌ సింగ్‌ పాడారు. చావు, విషాదం, కన్నీళ్లు జీవితంలో ఒక భాగమని. సంతోషంలాగే ఇవి కూడా జీవితంలో సమానమేనని వాజ్‌పేయి ఈ కవితలో అందంగా వర్ణించారు.

జుకీ న ఆంకే  
జగ్జీత్‌ సింగ్‌ నోట పలికిన ఈ పాట 1999లో విడుదలయింది. విషాదభరితమైన ఈ గీతంలో వాజ్‌పేయి తన భావాలను గుండెలకు హత్తుకునేలా చెప్పారు.

ఆవో మన్‌కీ గతే ఖోలే
వాజ్‌పేయి కలం నుంచి జాలువారిన ఈ గీతాన్ని లతా మంగేష్కర్‌ ఆలపించారు. గాన కోకిల ఆలపించిన ఈ గీతం ఆణిముత్యంగా నిలిచింది. అందం, వర్ణన, అనుభూతుల కలయిక అయిన ఈ పాట భావోద్వేగ భరితంగా ఉంటుంది.


అటల్‌జీ చివరి చిత్రం ఇదే..
అటల్‌జీకి భారతరత్న ప్రకటించిన తర్వాత అవార్డును అందించేందుకు 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీ ల్యూటెన్స్‌లోని కృష్ణమీనన్‌లో ఉన్న వాజ్‌పేయి బంగ్లాకు వెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌ అటల్‌జీ అవార్డు అందుకుంటున్న ఫొటో బయటకు విడుదల చేసింది. అందులో వాజ్‌పేయి ముఖం తక్కువగా కనబడేలా జాగ్రత్తపడ్డారు.

మరిన్ని వార్తలు