వాజ్‌పేయి : విదేశాంగ విధానంపై చెరగని ముద్ర

16 Aug, 2018 17:49 IST|Sakshi

1998-2004 మధ్యకాలంలో అయిదేళ్ల పాటు ప్రధాని పదవిని నిర్వహించిన తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రిగా అటల్‌ బిహారి వాజ్‌పేయి నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైబడి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న ఆయన, లోక్‌సభ సభ్యుడిగా పదిసార్లు, రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్టు ఎన్నికయ్యారు. భారతీయ జనసంఘ్‌ సంస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ సంస్థకే అధ్యక్షుడయ్యారు. 1965లోనే  తూర్పు ఆఫ్రికాకు పార్లమెంటరీ సౌహార్థ్ర బృందం ప్రతినిధిగా వెళ్లారు. 1967లో పార్టమెంటరీ ప్రతినిధిబృందంతో పాటు ఆస్ట్రేలియా సందర్శించారు.  1975లో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించాక ,1977లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నేతృత్వంలో జాతీయస్థాయిలో ప్రతిపక్షపార్టీలు ఏకమైనపుడు జనసంఘ్‌ను జనతాపార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత1977లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ విజయం సాధించాక, కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ కేబినెట్‌లో విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది విదేశాంగ మంత్రి హోదాలో ఐరాస జనరల్‌ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా నిలిచారు. (అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఫోటో గ్యాలరీ ఇక్కడ క్లిక్ చేయండి)

1979లో జనతాపార్టీ ప్రభుత్వం పతనమయ్యే నాటికి ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయనేతగా, ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగారు. ప్రధానిగా మొరార్జీదేశాయ్‌ రాజీనామా చేశాక కొంతకాలానికి జనతాపార్టీలో లుకలుకలు పరాకాష్టకు చేరాయి. ఈ నేపథ్యంలోనే 1980లో తన చిరకాల మిత్రులు ఎల్‌కే అద్వానీ, భైరవ్‌సింగ్‌ షెకావత్, జనసంఘ్, ఆరెస్సెస్‌లలోని స్నేహితులతో కలిసి భారతీయజనతాపార్టీని స్థాపించారు. 1974లో జపాన్,  1975లో శ్రీలంక,1983లో ఐరోపా పార్లమెంట్‌ను, 1984లో స్విట్జర్లాండ్,  1987లో కెనడా సందర్శించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 చివర్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండుసీట్లకే పరిమితమైంది. ఈ సందర్భంగా బీజేపీలో నాయకులు, కేడర్‌కు వాజ్‌పేయి కీలకనేతగా మారారు. ఆ తర్వాత కాలంలో విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్‌ల ఆధ్వర్యంలో నడిచిన రామజన్మభూమి ఉద్యమానికి బీజేపీ రాజకీయగొంతుగా మారింది. 1988,1990 నుంచి 96 వరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీకి హాజరైన భారత బృందంలో ఉన్నారు. 1994లో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన చూపింది. 1995లో గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందాక జాతీయ రాజకీయాల్లో పుంజుకుంది. 1995 నవంబర్‌లో ముంబైలో జరిగిన బీజేపీ మహాసభల్లో వాజ్‌పేయి దేశ ప్రధాని అవుతారంటూ అద్వానీ ప్రకటించారు. 1996 మే లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా బలనిరూపణలో విఫలం కావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. (వాజ్‌పేయి కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!)

ప్రధానిగా...
1998-2004 మధ్యకాలంలో ప్రధానిగా ఉన్నపుడు విదేశాంగ విధానంపై వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్‌2 అణుపరీక్షలు, పాకిస్తాన్‌తో స్నేహసం‍బంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు, చొరవతో పాటు 1999లో లాహోర్‌ డిక్లరేషన్‌ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్‌ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్‌ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. భారత్‌ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్‌తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారతపాక్‌లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునః ప్రారంభమయ్యాయి.

వాజ్‌పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్‌కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత‍్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని,  అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని,  ఇరుదేశాల మధ్య అన్నిరకాల ఘర్షణలు తగ్గించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. 1988లో రాజీవ్‌గాంధీబేనజీర్‌ భుట్టోల మధ్య అణ్వాయుధ రహిత ఒప్పందం కుదరగా, ఇది రెండోదిగా పరిగణిస్తున్నారు. అయితే నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని పర్వేజ్‌ ముషారఫ్‌ నేతృత్వంలోని సైన్యం కూలదోయడంతో ఈ ఒప్పందం నిరుపయోగంగా మారింది. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో దీనికి ఏమాత్రం విలువలేకుండా పోయింది.

కశ్మీర్‌లోని కార్గిల్‌ మంచుకొండల్లోకి పాకిస్తాన్‌ బలగాలు చొచ్చుకురావడంతో భారత్‌పాక్‌ల మధ్య పరిమిత యుద్ధానికి దారితీసింది. పాక్ దురాక్రమణను అమెరికాతో పాటు పశ్చిమదేశాలు  ఖండించాయి.ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించాల్సిందిగా నవాజ్‌షరీఫ్‌ను అమెరికాకు పిలిపించి హెచ్చరించారు. ఈ విధంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారిగా భారత్‌ పట్ల అమెరికా అనుకూల తీసుకుంది. 1999 జులైలో కార్గిల్‌ నుంచి పాక్‌ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌లో విజయం సాధించింది.

1978లో జిమ్మీకార్టర్‌ భారత్‌లో పర్యటించాక 22 ఏళ్ల అనంతరం 2000లో అమెరికా అధ‍్యక్షుడి హోదాలో బిల్‌ క్లింటన్‌ మన దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ’ఇండియా రిలేషన్స్‌  : ఏ విజన్‌ ఫర్‌ ది 21 ఫస్ట్‌ సెంచరీ’ పత్రంపై సంతకాలు చేశారు. ఆ తర్వాతి కాలంలో అమెరికాతో భారత్‌ సంబంధాలు బలపడేందుకు ఈ పర్యటన, తదనంతర పరిణామాలు దోహదపడ్డాయి.

2003లో చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి.  రష్యా అధ‍్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా, విమానాల కొనుగోలు, తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు  కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్‌పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య, భద్రతా, రాజకీయరంగాల్లో సహకారం కోసం ’మాస్కో డిక్లరేషన్‌’పై సంతకాలు జరిగాయి.

2001 జులైలో భారత్‌తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్‌ అధ‍్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్‌ అంశంపై ముషారఫ్‌ మొండిపట్టుదల కారణంగా ఆగ్రా జరిగిన ఈ శిఖరాగ్రభేటీ నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. ’లుక్‌ ఈస్ట్‌ పాలసీ’లో భాగంగా వియత్నాం, ఇండోనేషియా, తదితర దేశాల్లో పర్యటించిన వాజ్‌పేయి వ్యాపార,వాణిజ్య అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియాన్‌ దేశాలతో వాజ్‌పేయి మంచి సంబంధాలు నెలకొల్పగలిగింది. 2000 జూన్‌లో లిస్బన్‌లో మొట్టమొదటి భారత్‌ఐరోపా దేశాల సంఘం (ఈయూ)శిఖరాగ్ర సమావేశం జరిగింది. 

మరిన్ని వార్తలు