‘అచ్చెన్నాయుడి ఎన్నిక చెల్లదు’

8 Jul, 2019 19:41 IST|Sakshi

అఫిడవిట్‌లో అరెస్ట్‌ వారెంట్‌ను దాచారు

ఎన్నికపై న్యాయం పోరాటం చేస్తాం: పేరాడ తిలక్‌

సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదని ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెరాడ తిలక్‌ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు పోటీచేసిన గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తిలక్‌ డిమాండ్‌ చేశారు. 2007 జూలై 21న మైనింగ్‌ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్‌ పోలీస్‌ స్టేషన్‌ క్రైమ్‌ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఓబులాపురం మైనింగ్‌ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్‌ వారెంట్‌ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు.

ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో దాచినందుకు ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే చర్యలు తీసుకుని.. ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్‌ తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్రమంగా ఎన్నికయ్యారంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని  ఆ పార్టీ  నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి గతంలోనే తెలిపిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా