నిషేధం పేరుతో మైనార్టీలపై దాడులు: సురవరం

2 Apr, 2018 12:38 IST|Sakshi
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌ : పశుమాంసం నిషేధం పేరుతో సాధారణ ప్రజలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..‘  ముస్లింలను భయభ్రాంతులకు గురిచేసి రెండవ తరగతి ప్రజలుగా ముద్రవేస్తున్నారు. యూనివర్శిటీల్లో దళిత విద్యార్థులు, వామపక్ష విద్యార్థులపై దాడులు పెరుగుతున్నాయి. ఒక్క ఏబీవీపీ తప్ప వేరే విద్యార్థి సంస్థ ఉండొద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రగతిశీల భావాలున్న విద్యార్థులను చదువుకు దూరం చేసేలా స్కాలర్‌షిప్‌లు రద్దు చేస్తున్నారు’  అని అన్నారు.

 ‘ వందలకోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్న బడా వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలు పారిపోతున్నారు. తెలిసినవారు కొందరే..ఇంకా తెలియని వారెందరో ఉన్నారు. మాల్యా రూ.9 వేల కోట్లు, నీరవ్ మోడీ రూ.12 వేల కోట్లు ముంచి పారిపోయారు. ఐపీఎల్ మాజీ చైర్మన్‌ లలిత్ మోదీకి సుష్మ స్వరాజ్‌, వసుంధరారాజేతోపాటు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీకి మరో దేశానికి వెళ్లేందుకు సుష్మ స్వరాజ్ మనవతా దృక్పదంతో సహాయం చేశారు ’ అని తెలిపారు.

 బ్యాంకులను పంగనామాలు పెట్టిన వారే  ప్రభుత్వ  బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు.  బ్యాంకులను దివాలా తీయించినవారే ప్రైవేట్ పరం కోసం ఒత్తిళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల నుంచి వసూలు కాని బాకీలు 7 శాతం మాత్రమేనని, బడా బాబులు ఎగ్గొట్టినవే 90 శాతం ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ప్రజలకు తెలిసేలా వామపక్షాలు కృషిచేస్తోంటే అదంతా తప్పని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు