‘ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10వేల ఆర్థిక సాయం’

8 Jan, 2019 18:20 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 

ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం..
పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్‌, ఫైన్లు, ఫిట్‌నెస్‌ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 

104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తాం
నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు వైఎస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలో వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం కోసం ప్రతి నెలకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారి సమస్యలపై స్పందించిన జననేత.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు.. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన రైల్వేజోన్‌ సాధన సమితి సభ్యులు..
పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఉత్తరాంధ్ర రైల్వే జోన్‌ సాధన సమితి సభ్యులు కలిశారు. రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారు జననేతకు వివరించారు. 

మరిన్ని వార్తలు