ఉద్దండుల కర్మభూమి కనౌజ్‌

25 Apr, 2019 04:25 IST|Sakshi

 

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్‌ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ జరుగుతోంది. అవధ్‌ ప్రాంతంలోని ఐదు సీట్లు(ఉన్నావ్, హర్దోయ్, కాన్పూర్, ఖేరీ, మిస్రిక్‌), బుందేల్‌ఖండ్‌లోని మూడు స్థానాల్లో(జాలోన్, ఝాన్సీ, హమీర్‌పూర్‌) పాలకపక్షమైన బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాలతోపాటు షాజహాన్‌పూర్, ఫరూఖాబాద్, ఇటావా, కనౌజ్, అక్బర్‌పూర్‌లో ఈ నెల 29న పోలింగ్‌ జరుగుతుంది.

రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్‌లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కోడలు డింపుల్‌ మరోసారి పోటీలో ఉండగా,  ఉన్నావ్‌లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్‌ మళ్లీ బరిలోకి దిగారు.
ఫరూఖాబాద్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్‌లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ జోషీ స్థానంలో సత్యదేవ్‌ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్‌ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగuŠ‡బంధన్‌ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్‌ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు.  

మొదటి రెండు దశల్లో పోలింగ్‌ జరిగిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో రెండు పార్టీలు ఎన్నికల్లో బాగానే కలిసి పనిచేస్తున్నాయి. ములాయం పోటీచేస్తున్న మైన్‌పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం, ఆమెకు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్‌ ఇస్తున్న గౌరవ మర్యాదలు రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు గట్టిగా కృషిచేయడానికి దారితీసింది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందని పోలింగ్‌ సరళిని బట్టి అంచనావేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్‌ జరిగే అవధ్, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.


డింపుల్‌ యాదవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సత్యదేవ్‌ పచౌరీ, సాక్షీ మహారాజ్‌, అనూ టండన్‌

ఉద్దండుల కర్మభూమి కనౌజ్‌
మాజీ సీఎం అఖిలేశ్‌ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్‌ యాదవ్‌ మూడోసారి కనౌజ్‌ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోట కనౌజ్‌ నియోజకవర్గం.  ములాయం ఈ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు.  1967లో సోషలిస్ట్‌ నేత రాంమనోహర్‌ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్‌తోపాటు ఫిరోజాబాద్‌ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్‌ ఫిరోజాబాద్‌ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్‌ పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి, బాలీవుడ్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓడిపోయారు.

2012లో అఖిలేశ్‌ యూపీ సీఎం పదవి చేపట్టాక కనౌజ్‌ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డింపుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆమె తన సమీప  అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌పై 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిర్మల్‌ తివారీకి లక్షా 27 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మద్దతు ఇవ్వడంతో డింపుల్‌ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కిందటిసారి ఓడిపోయిన సుబ్రత్‌ పాఠక్‌ మరోసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండడంతో డింపుల్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. యాదవులతోపాటు గణనీయ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల ఓట్లు ఈ వర్గానికి చెందిన పాఠక్‌కే పడితే డింపుల్‌కు గట్టి పోటీ తప్పదు. నామినేషన్‌ రోజు డింపుల్‌ ఊరేగింపులో పాల్గొన్న ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారుల సంఖ్యను బట్టి ఆమె విజయం సునాయాసమని మహా కూటమి అంచనావేస్తోంది.

సాక్షీ మహారాజ్‌కు    సాటి ఎవరు?
ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్‌ సభ్యుడు సాక్షీ మహారాజ్‌   (డా.సచ్చిదానంద్‌ హరి సాక్షి)కు ఆలస్యంగా ఉన్నావ్‌లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్‌ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్‌ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్‌శంకర్‌ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్‌ పాఠక్‌కు రెండు లక్షలకు పైగా ఓట్లు దక్కాయి. 2009లో ఇక్కడ నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ అభ్యర్థి అన్నూ టండన్‌ లక్షా 97 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సాక్షి మహారాజ్‌ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత.

1991లో మథుర నుంచి, 1996, 98లో ఫరూఖాబాద్‌ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్‌లో కింద టిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గం వారే. అయితే, ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది. ఈసారి కూడా ఎస్పీ, కాంగ్రెస్‌ తరఫున అరుణ్‌శంకర్‌ శుక్లా, అనూ టండన్‌ పోటీకి దిగారు. పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో లేదు. 1999 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు ఉన్నావ్‌లో గెలవలేదు. మహా కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాక్షి ఈ ఆనవాయితీ నిజమైతే గెలవడం కష్టమే.

ఫరూఖాబాద్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌   మరో ప్రయత్నం!
రెండో యూపీఏ సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వివాదాస్పద కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మరోసారి ఫరూఖాబాద్‌ నుంచి రంగంలోకి దిగారు. ఆయన ఇక్కడ 1991, 2009లో రెండుసార్లు విజయం సాధించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలవడమేగాక డిపాజిట్‌ కోల్పోయారు. 2014లో బీజేపీ అభ్యర్థి ముకేష్‌ రాజ్‌పుత్‌ తన సమీప ఎస్పీ అభ్యర్థి రామేశ్వర్‌ యాదవ్‌పై లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున రాజ్‌పూత్, ఖుర్షీద్‌ బరిలోకి దిగారు.ఈసారి మహాగuŠ‡బంధన్‌ తరఫున బీఎస్పీ అభ్యర్థి మనోజ్‌ అగర్వాల్‌ పోటీకి దిగారు. సల్మాన్‌ ఖుర్షీద్‌ మాజీ రాష్ట్రపతి డా.జాకిర్‌హుస్సేన్‌ మనవడు. 1984లో ఖుర్షీద్‌ తండ్రి ఖుర్షీద్‌ ఆలం ఖాన్‌ విజయం సాధించాక మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లో ఖుర్షీద్‌ ఫరూఖాబాద్‌లో డిపాజిట్‌ దక్కించుకోలేదంటే కాంగ్రెస్‌ ఇక్కడ ఎంత బలహీనమైందో అర్థంచేసుకోవచ్చు. విద్యావంతుడు, ప్రసిద్ధ లాయర్‌ అయిన ఖుర్షీద్‌ నెహ్రూగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు సంపాదించారు.

కాన్పూర్‌లో కొత్త నేత
యూపీలో మొదటి పారిశ్రామిక నగరంగా పేరొందిన కాన్పూర్‌ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ జోషీ కిందటి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 85 ఏళ్ల జోషీకి మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో సత్యదేవ్‌ పచౌరీ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో కాన్పూర్‌ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ (కాంగ్రెస్‌)ను 2014లో జోషీ రెండు లక్షల 22 వేలకు పైగా ఆధిక్యంతో ఓడించా రు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎస్పీ. బీఎస్పీ కూటమి తరఫున శ్రీరాం కుమార్‌(ఎస్పీ) బరిలోకి దిగారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేత జైస్వాల్‌కు బీజేపీ కొత్త అభ్యర్థికి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.  

బుందేల్‌ఖండ్‌పై బీజేపీ పై చేయి    సాధిస్తుందా?
యూపీ, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మూడు యూపీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మహా కూటమి మధ్య హోరాహోరీ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాలోన్‌(ఎస్సీ), ఝాన్సీ, హమీర్‌పూర్‌ సీట్లలో నాలుగో దశలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని బందా స్థానంలో మే ఆరున పోలింగ్‌ జరుగుతుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులతోపాటు బీసీలు, దళితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ముస్లింల జనాభా బాగా తక్కువ.

ఈ కారణంగా బీజేపీ, ఎస్పీబీఎస్పీ కూటమి మధ్య బుందేల్‌ఖండ్‌లో గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా మొగ్గు కాషాయపక్షానికే ఉందని కొందరు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నాలుగు సీట్లలో అత్యధికంగా 44.86 శాతం ఓట్లు సాధించి అన్నింటినీ కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 45.01 శాతానికి పెంచుకుని ఈ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో  విజయం సాధించింది. 1996, 1998 ఎన్నికల్లో సైతం బీజేపీ ఇక్కడ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడంతో బీజేపీకి తొలిసారి ఊహించని పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్‌ రెండు సార్లు ఒక్కొక్క సీటునే గెలుచుకుంది.

జాలోన్, హమీర్‌పూర్‌లో బీఎస్పీ పోటీచేస్తుండగా, ఝాన్సీలో ఎస్పీ అభ్యర్థిని నిలిపింది. స్వల్ప సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ నూరు శాతం విజయాలు సాధించడం కష్టమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే బందా, ఝాన్సీలో ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న బుందేల్‌ఖండ్‌ ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదు. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు