'తండ్రి జపాన్‌,సింగపూర్‌.. కొడుకేమో అమెరికా అంటున్నాడు'

22 Jan, 2020 13:57 IST|Sakshi

సాక్షి,అమరావతి : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైజాగ్‌లోని భూముల్ని యధేచ్చగా దోచుకున్నారని బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్‌ శాసనమండలిలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ దోపిడిపై చంద్రబాబుకు తాను స్పష్టమైన ఆధారాలు ఇచ్చానని, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అప్పట్లో విశాఖ రైల్వేజోన్‌ కూడా విజయవాడకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారని తెలిపారు. అయితే అప్పట్లో స్థానిక ఎంపీలుగా తాను, సుబ్బం హరిబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించామని, పదవీ రిజైన్‌కు కూడా సిద్ధపడ్డామని గుర్తుచేశారు.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే చంద్రబాబు, నారా లోకేష్‌లు అదే పనిగా అడ్డుతగులుతున్నారని అవంతి మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు జపాన్‌, సింగపూర్‌ అంటుంటే.. లోకేష్‌ అమెరికా అంటున్నారని, కానీ తాము మాత్రం శ్రీకాకుళం, విజయనగరం అంటున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖపై ఎందుకు విషం కక్కుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికి ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో విద్య, వైద్య సదుపాయాల్లేవని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.ఇవాళ లోకేష్‌ ధర్నాలు, దీక్షలు, కేసుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాపుల రిజర్వేషన్‌ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంపై ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలియనిది కాదా అని ప్రశ్నించారు.

ఆ సమయంలో తాము కాపు అన్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపించిన టీడీపీ వాళ్లు ఇప్పుడు ధర్నాలు , కేసుల గురించి మాట్లాడితే అపహాస్యంగా ఉందని విమర్శించారు. అమరావతిని తామ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెబుతున్న లోకేష్‌ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఎందుకు ఓడిపోయాడో చెప్పాలని ప్రశ్నించారు. భీమిలిలో తనపై పోటీ చేయడానికి లోకేష్‌ నాలుగుసార్లు సర్వే చేయించుకుఆన్నరని, ఓడిపోతాననే భయంతోనే మంగళగిరి నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారని అవంతి తెలిపారు.

(మండలిలో నారా లోకేష్‌కు సవాల్‌ విసిరిన బుగ్గన)

మరిన్ని వార్తలు