ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత వివక్ష?

9 Jan, 2020 21:24 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధానిపై చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. తన స్వార్థం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అశాంతికి ప్రయత్నిస్తున్నారని, ఆయన కుట్రలను తిప్పి కొడుతామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు విధానాలను అవలంభిస్తే మరికొన్ని ఏళ్లలలో ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమాలు మొదలవుతాయన్నారు.

సంపద అంతా రాజధానికే ఖర్చు చేస్తే మిగతా ప్రాంతా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూర్చడం వల్లే గత ఎన్నికలలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని, అయినప్పటికీ ఆయన మారడం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రపై ఎందుకంత వివక్ష అని చంద్రబాబును నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. వయసులో చిన్నవాడైన సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలు ప్రజలలోకి వెళ్ళకుండా ఉండడానికి ఈ రాజధాని ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు సృష్టించారు ఆరోపించారు. అమ్మ ఒడి.. పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను విడుదల లాంటి గొప్ప అంశాలు మరుగున పడేలా చంద్రబాబు నాయుడు ఆయన మీడియా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా.. సీఎం జగన్‌ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, సీఎం జగన్‌ అందరికి న్యాయం చేస్తారని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు