చంద్రబాబు నీచ రాజకీయాలు మానాలి: అవంతి

10 May, 2020 17:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ‘ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి విదేశీ మోజు ఎక్కువ. మనలాంటి సాధారణ మనుషులంటే ఆయనకి పడదు.. సూటు,బూటు వేసుకున్న వాళ్లంటేనే ఇష్టం’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి అభద్రతా భావం పెరిగిపోయిందని అన్నారు. ఆయన హయాంలోనే నిబంధనలకి విరుద్దంగా ఎల్జీ‌ పాలిమర్స్‌కి ఇష్టానుసారం అనుమతులిచ్చేశారని తెలిపారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు‌ లేకపోయినా ప్లాంట్ విస్తరణకి బాబు హయాంలో అనుమతులు ఇవ్వలేదా.. సింహాచలం దేవస్ధానం భూములని సైతం అక్రమంగా డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్‌ అప్పగించింది మీరే కదా బాబు? అంటూ మండిపడ్డారు. 

మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బాబుకు ఎక్కడిది
‘‘ చంద్రబాబుకి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలని ఎవరినీ నమ్మేవారు కాదు. సీఎం వైఎస్ జగన్ మమ్మల్ని, అధికారులని నమ్మి బాధ్యతలు అప్పగించారు. బాబుకి తానొక్కడినే ప్రచారం పొందాలనే యావ ఎక్కువ. తన హయాంలో జరిగిన ప్రమాదాలపై ఎలా స్పందించారో ప్రజలకి తెలియదా?. ప్రజలు అమాయకులు కాదు... ఆయన తప్పుడు ఆరోపణలను గమనిస్తున్నారు. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే బాబు ఓర్వలేక విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. ( 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' )

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది‌కాదు. చాలా వేగంగా స్పందించి ప్రమాద స్ధాయిని తగ్గించగలిగాం. గంట ఆలస్యమైనా ప్రమాద స్ధాయి ఎక్కువగా ఉండేది. సీఎం జగన్‌కు చంద్రబాబులా ప్రచారయావ లేదు. ముఖ్యమంత్రి మనసుతో ఆలోచించే బాధిక కుటుంబాలకి కోటి రూపాయిలు నష్టపరిహారం ప్రకటించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానాల’’ని హితవుపలికారు.

మరిన్ని వార్తలు