‘వాయిదా పడ్డా వైఎస్సార్‌సీపీదే విజయం’

17 Mar, 2020 17:44 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థలకు నిధులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల నిధులను పోరాడి సాధించుకుందామని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగి‌నా 5,800 కోట్ల నిధులిప్పిస్తామని బీజేపీ చెప్పాలని అవంతి సవాల్‌ విసిరారు. ఆరు వారాలు కాదు.. ఆరు నెలల పాటు ఎన్నికలు వాయిదా పడ్డా వైఎస్సార్‌సీపీదే విజయమన్నారు. ఎన్నికల కమీష‌నర్ రమేష్ కుమార్ సీఎస్‌కి రాసిన లేఖ టీడీపీ నాయకులు రాసినట్టుందని ఆయన మండిపడ్డారు. ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు అని అన్నారు. ('కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు')

ఎన్నికల‌ కమీషనర్.. ఇంకా చంద్రబాబే సీఎం అనుకుంటున్నారామో అని అవంతి ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్ జగన్‌ను ప్రజలు ఎన్నుకున్నారని ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలకి నష్టం కలిగించే కార్యక్రమం చేయడం వల్ల రాజ్యాంగబద్ద పదవులపై ప్రజలకి నమ్మకం పోతుందన్నారు. ఆరు నెలలు వాయిదా వేశామని చెబుతూనే అధికారులను బదిలీ చేయాలని ఎలా చెబుతారని ఆయన మండపడ్డారు. 

విజయవాడ బొండా ఉమాకి మాచర్లలో పనేంటని అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులకి చెప్పకుండా మాచర్ల ఎందుకు వెళ్లారని ఆయన ఆగ్రహించారు. పోలీసులు వాళ్ల విధులు వాళ్లు నిర్వహిస్తే మీకు చెడ్డవాళ్లు.. మీ మాట వింటే మంచివాళ్లా అని ఆయన మండిపడ్డారు. కుట్ర రాజకీయాలతో చంద్రబాబు అడుగడుగునా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారని అవంతి ధ్వజమెత్తారు.  ఇప్పటికైనా ఎన్నికల‌ కమీషనర్ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్లు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అవంతి డిమాండ్‌ చేశారు.

వీఎంఆర్‌డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యూహంలో ఎన్నికల‌ కమీషన్ చిక్కుకుందని మండిపడ్డారు. ఎన్నికల వాయిదా ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పధకాల అమలు చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఈ కుట్రలకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఉగాది నాడు పేదలకి ఇళ్ల పట్టాలివ్వాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాలను‌ కుట్రలతో అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల వాయిదాని ఖండిస్తున్నామని.. ఎన్నికల కమీషన్ పునరాలోచించాలన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు