విశాఖను పర్యాటక రాజధాని చేస్తా

9 Jun, 2019 12:57 IST|Sakshi

పమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్‌జగన్‌ సర్కారు పెద్దపీట వేసింది. మంత్రివర్గ కూర్పులోనూ, విప్‌ల నియామకంలోనూ జిల్లాకు తగిన ప్రాధాన్యం కల్పించింది. మంత్రిమండలిలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ స్థానం శుక్రవారమే ఖరారు కాగా శనివారం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇప్పటికే సమర్థుడిగా గుర్తింపు పొంది అమాత్య పదవి పొందిన అవంతికి పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. పర్యాటక స్వర్గధామమైన విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు అదే శాఖ కేటాయించడం విశేషం.

విశాలమైన తీరప్రాంతం, ఎన్నోపర్యాటక స్థలాలు ఉన్న రాష్ట్రంలో వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయి.ఇక మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ వెంట ఉండి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యే ముత్యాలనాయుడుకు ప్రభుత్వ విప్‌గా నియమించి సముచిత గౌరవం కల్పించారు.2014లో జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి ఫిరాయించనా.. బూడి మాత్రం అటువంటి వాటికి లొంగకుండా నైతిక విలువలకు కట్టుబడి వైఎస్‌జగన్‌ వెంటే నిలిచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు పొందారు. గత అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఉప నాయకుడిగా పని చేసిన ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్‌ హోదాలో మరింత గౌరవప్రదంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖమంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు తెలిపారు. మంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పట్టించుకోకుండా రియల్‌ ఎస్టేట్‌ రంగానికే అధిక ప్రాధాన్యమిచ్చిందని, పర్యాటక ఆదాయ వనరులను విస్మరించిందని ఆరోపించారు. తాను పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వనరులు పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. విశాఖను ప్రపంచ పటంలో నిలిపేందుకు పాటుపడతానన్నారు. అలాగే నవ్యాంధ్రను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తానని అన్నారు. పర్యాటక రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయంతో పాటు వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఆ క్రమంలోనే ప్రాధాన్య శాఖ అయిన పర్యాటక శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని తెలిపారు.  సీఎం ఏ నమ్మకంతో అప్పజెప్పారో ఆ మేరకు తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. పర్యాటకాభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అనువైన ప్రాంతాలున్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. తనను మంత్రి చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
 
నేడు విశాఖకు అవంతి రాక..
మంత్రిగా తొలిసారి బాధ్యతలను స్వీకరించిన అవంతి శ్రీనివాస్‌ ఆదివారం విశాఖ నగరానికి వస్తున్నారు. అమరావతి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన రానున్నారు. ఉదయం 9 గంటలకు పాయకరావుపేట, 9.30 గంటలకు యలమంచిలి, 10 గంటలకు అనకాపల్లి, 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కొత్త మంత్రికి ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం నగరంలోని మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్‌ పార్కు వద్ద అభిమానులు, ఆత్మీయులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభను ముగించుకుని నగరంలోని మద్దిలపాలెంలో ఉన్న పార్టీ ఆఫీసును సందర్శిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం భీమిలిలోని పార్టీ ఆఫీసుకు చేరుకుంటారు.

పర్యాటక శాఖ తొలిసారి.. 
విశాఖ జిల్లాకు పర్యాటకశాఖ దక్కడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ జిల్లాకు దేవాదాయ, పంచాయితీరాజ్, రోడ్లు, భవనాలు, అటవీ, సహకార, విద్య, మానవ వనరులు, గిరిజన సంక్షేమ శాఖ తదితర మంత్రి పదవులు లభించాయి. పర్యాటకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే విశాఖకు తొలిసారిగా పర్యాటక శాఖ ఇవ్వడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. అవంతి శ్రీనివాస్‌కు పర్యాటక శాఖ కేటాయించడం వల్ల విశాఖ నగరం, జిల్లా పర్యాటకరంగం మరింతగా అభివృద్ది చెందుతుందన్న ఆశాభావం అన్ని వర్గాల వారిలో కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు