తొందరెందుకు.. వేచిచూద్దాం!

14 Aug, 2019 03:39 IST|Sakshi

అప్పుడే ఆందోళనలు వద్దు

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో అయ్యన్నపాత్రుడు

చంద్రబాబు సమక్షంలోనే లోపాలను బయటపెట్టిన నేతలు

సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాకముందే ఆందోళనల పేరుతో ప్రజల్లోకి వెళ్లడం సరికాదని పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు మాజీ సీఎం చంద్రబాబు ఎదుటే స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించి కొద్దిరోజులు మౌనంగా ఉంటే మంచిదని సూచించారు. విజయవాడలోని ఒక ఫంక్షన్‌ హాలులో సోమవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్తు కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ నేతలు చంద్రబాబు సమక్షంలోనే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అయితే నేరుగా చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలనడం సరికాదంటూ ప్రజలు తీర్పు ఇచ్చిన స్వల్ప వ్యవధిలోనే తొందరపాటుతో జనంలోకి వెళ్లొద్దని సూచించారు. 

తెల్ల ఏనుగుల్లాంటి వారికి పదవులా!?
అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. పార్టీలో స్వార్థపరులకు పదవులిస్తున్నారని, తెల్ల ఏనుగుల్లాంటి వారిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదుసార్లు ఓడిపోయిన వారికి మళ్లీ పదవులిచ్చి అందలమెక్కించారని ఇలాంటి చర్యలవల్లే దెబ్బతిన్నామని కుండబద్దలు కొట్టారు. పార్టీలో యువకులు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని.. అవసరమైతే తన డిప్యూటీ లీడర్‌ పదవిని బీసీ నేత ఎవరికైనా ఇవ్వాలన్నారు.

కీలక నేతల డుమ్మా 
కాగా, ఈ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల నుంచి పార్టీని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని సమావేశాన్ని అస్సలు  పట్టించుకోలేదు. గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్‌రెడ్డి, అశోక్‌గజపతిరాజు వంటి ముఖ్యులతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమితో అధైర్యపడాల్సిన అవసరంలేదని, ధైర్యంగా పనిచేయాలన్నారు. ఇకపై పూర్తికాలం కార్యకర్తలకే సమయం కేటాయిస్తానన్నారు. 

మరిన్ని వార్తలు