క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

30 Jul, 2019 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్‌ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్‌ను కోరారు. అందుకే వెంటనే ఖాన్‌ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు.

ఖాన్‌ పక్కనే ఉన్న ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్‌ను స్పీకర్‌ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్‌ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్‌ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్‌ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్‌తలాక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్‌ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు