వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజం ఖాన్‌

17 May, 2019 12:10 IST|Sakshi

లక్నో : బీజేపీ లోక్‌సభ అభ్యర్థి  సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ ఈ వ్యాఖ్యలపై మండి పడ్డారు. గాడ్సే, ఖాకీ నిక్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపు తెచ్చాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్నాళ్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అనగానే ఖాకీ నిక్కరు ఎలా గుర్తుకు వచ్చేదో.. ఇక మీదట గాడ్సే కూడా అలానే గుర్తుకు వస్తాడు. ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆర్‌ఎస్‌ఎస్‌ అస్థిత్వాలు. ఇప్పుడిక నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని గాంధీ పేరుతో గుర్తుంచుకోవాలో.. గాడ్సే పేరుతో గుర్తుంచుకోవాలో అనే నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలి. మానవత్వం కావాలో.. ఖాకీ నిక్కరు కావాలో ఓటర్లే తేల్చుకోవాల’న్నారు. అంతేకాక గాడ్సే మద్దతుదారురాలు అయినందుకు గాను ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆజం ఖాన్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

మరిన్ని వార్తలు