‘కారు’ ఎక్కనున్న అజారుద్దీన్‌?

1 Jan, 2019 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్‌ అధికారికంగా చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు, అభిమానులు వెల్లడించారు.  

2009లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా.. 
క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన అజారుద్దీన్‌ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరా దాబాద్‌ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో  పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత  ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు.  అసెం బ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన్ను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడటంతో అజారుద్దీన్‌  రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలని నిర్ణ యం తీసుకున్నట్టు సన్నిహితులు పేర్కొన్నారు.  

అందుబాటులోకి రాని అజారుద్దీన్‌.. 
టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై ‘సాక్షి’ అజారుద్దీన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. తనకు సన్నిహితులుగా పేరున్న ఇతర కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆయన త్వరలోనే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారని, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానా న్ని టీఆర్‌ఎస్‌ ఆయనకు కేటాయించే అవకాశాలున్నాయని తెలిపారు.  కాగా, సోమవారం  గోల్కొండ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమీక్ష సమావేశానికి కూడా అజార్‌ హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు