ఓటమి భయంతో.. టీడీపీ దాడులు

12 Mar, 2020 04:05 IST|Sakshi
రోడ్డు మీద హల్‌చల్‌ చేస్తూ దుర్బాషలాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

కడపలో బీటెక్‌ రవి వీరంగం

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మాజీ మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్‌రెడ్డి 

‘అనంత’లో టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు

సాక్షి, నెట్‌వర్క్‌:  స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రెచ్చిపోయారు. నడిరోడ్డులో పోలీసులపై రాయలేని భాషలో బూతులతో విరుచుకుపడ్డారు. బుధవారం కడప ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద అరగంట పాటు వీరంగం సృష్టించారు. వివరాల్లోకెళ్తే.. తొండూరు మండలంలో టీడీపీకి చెందిన అరుణమ్మ తనను నామినేషన్‌ వేయనీయలేదని ఆరోపిస్తూ కడప ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై హడావుడి చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీటెక్‌ రవి ఆమెకు జత కలిసి గొడవను మరింత పెంచారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఊళ్లలో ప్రచారానికి ఎలా వస్తారో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. బీటెక్‌ రవి వీరంగంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల కుమారుడు రగడ
రేణిగుంట తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. నామినేషన్‌ వేయడానికి తన అనుచరులకు వెంటనే కులధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని అధికారులను దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారు. ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండల తెలుగుదేశం అధ్యక్షుడు కామేష్‌యాదవ్‌ ఇంట్లో బుధవారం రాత్రి ఎక్సైజ్‌ పోలీసులు పది మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఆయన్ని అరెస్ట్‌ చేసి ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్‌రెడ్డి తన అనుచరులతో ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకుని కామేష్‌ను విడిచిపెట్టాలంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. నానా హంగామా సృష్టించారు.

‘అనంత’లో టీడీపీ నేతల దుర్భాషలు, దాడులు
అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో టీడీపీ కార్యకర్త చెన్నకేశవులు దుర్భాషలాడి వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్‌పై దాడికి ప్రయత్నించాడు. అలాగే పుట్లూరు మండలం అరకటివేములలో ఎన్నికల కోడ్‌ సందర్భంగా బస్‌షెల్టర్‌పై ఉన్న పరిటాల రవి చిత్రపటానికి ఎన్నికల అధికారులు ముసుగు వేశారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చిత్రపటం మీద ఉన్న ముసుగును తొలగించి రాద్ధాంతం చేశారు. కళ్యాణదుర్గం మండలం గోళ్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసి తిరిగి వెళుతుండగా.. పార్టీ కార్యకర్తలు ధనుంజయ, గురుగప్పలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. వీరిద్దరూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు