అన్నీ బయటపెడతా: బాబుమోహన్‌

29 Sep, 2018 17:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇరవై ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నుంచి ఫోన్‌ రాకపోవడంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆందోల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ అన్నారు. శనివారం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినందు వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబుమోహన్‌ వ్యాఖ్యానించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో హరీశ్‌రావు ఫోన్‌ చేసి తనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారన్నారు. వారు చెప్పినట్లుగానే ఆందోల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. కానీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ 105 మందిలో తానొక్కడినే పనికి రాని వాడిని అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు తాను ఎందుకు పనికిరాలేదో, టికెట్‌ ఎందుకు ఇవ్వలేదోనన్న విషయాలన్నీ సమయం వచ్చినపుడు బయటపెడతానని వ్యాఖ్యానించారు.

పదవుల కోసం కాదు..
టికెట్‌ విషయమై కేటీఆర్‌ను అడిగితే కేసీఆర్‌ ఫోన్‌ చేస్తారని చెప్పారని, కానీ ఇంతవరకు ఆయన నుంచి ఫోన్‌ రాలేదని బాబుమోహన్‌ అన్నారు. అదే సమయంలో అమిత్‌ షా పిలిచి తనకు అవకాశం ఇచ్చారని బాబుమోహన్‌ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనతో పాటు, తన కుమారుడు ఉదయ్‌ కూడా బీజేపీలో చేరారని బాబుమోహన్‌ తెలిపారు. పదవుల కోసం కాకుండా కేవలం పనిచేయడం కోసమే పార్టీలో చేరామని స్పష్టం చేశారు. (చదవండి: టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌)

స్వార్థ రాజకీయాలు చూడలేకే : లక్ష్మణ్‌
మూడు పర్యాయాలు ఆందోల్ ఎమ్మెల్యే గా గెలుపొందిన బాబుమోహన్... నటుడిగా కూడా ప్రజల గుండెల్లో నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కలిసి కూటమిగా పోటీ చేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటివి చూడలేకే బాబుమోహన్‌ బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు. మరోవైపు మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది మహాకూటమి కాదు విషకూటమి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీలకు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లేనని విమర్శలు గుప్పించారు. కాగా అక్టోబర్‌లో అమిత్‌ షా మరోసారి తెలంగాణకు వస్తారని లక్ష్మణ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు