‘హిందూధర్మానికి రక్షణగా ఉంటా’

2 Apr, 2019 17:07 IST|Sakshi
ప్రచారంలో మాట్లాడుతున్న బాబు మోహన్‌

సాక్షి, మల్యాల(చొప్పదండి): హిందూధర్మ పరిరక్షణే ధ్యేయమని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని, ఒక్కసారి ఆశీర్వదించాలని బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మల్యాల బ్లాక్‌ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తల డప్పుచప్పుళ్లు, యువకుల బైక్‌ ర్యాలీ మధ్య మాజీమంత్రి బాబుమోహన్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. హిందూ ధర్మరక్షణే తన ప్రథమ కర్తవ్యమని, ఎంపీగా గెలిపిస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటానని సంజయ్‌ స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడబోనని, హిందువులను సంఘటితం చేసి తీరుతానని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను టీఆర్‌ఎస్‌ విడుదల చేస్తున్నట్లు గొప్పలకు పోతోందని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో పొత్తుపెట్టుకున్న కేసీఆర్‌ ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రక్షణ కోసం అవసరమైతో సరిహద్దులో యుద్ధం చేసే సైనికులను తయారుచేస్తున్నానని అన్నారు. 

అన్ని కేంద్ర నిధులతోనే.. 
కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదని సంజయ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1000 పింఛన్‌లో కేంద్రం వాటా రూ.800 ఉందని, ఉపాధి హామీ పథకం, హరితహారం, స్వచ్ఛభారత్, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల కోసం రూ.1,500 కోట్లు విడుదల చేశారని అన్నారు. 

ఆకట్టుకున్న బాబుమోహన్‌ డైలాగ్స్‌..
బాబుమోహన్‌ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ను గెలిపించి, మోదీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో బింగి వేణు, కెల్లేటి రమేశ్, పాల్గొన్నారు. 

కేసు నమోదు 
బండి సంజయ్, బాబుమోహన్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. మల్యాలలో రోడ్‌షోకు సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అనుమతి తీసుకుని అదనంగా మూడు గంటలు ఎక్కువ సమయం ప్రచారం చేశారని, దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ పల్లె ప్రసాద్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

నిధులు కేంద్రానివి.. పేరు టీఆర్‌ఎస్‌ది
కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులను రాష్ట్రానికి సంబంధించినవిగా చెప్పుకుంటూ.. సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. కొడిమ్యాల, పూడూరులో సోమవారం రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో రెండులక్షల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లను మంజూరుచేస్తే కేసీఆర్‌ పేదలకు ఇళ్లను నిర్మించకుండా నిధులను పక్కదారిపట్టించారని ఆరోపించారు. కొడిమ్యాల, మల్యాల మండలాలకు కేంద్రంద్వారా మంజూరైన నిధుల వివరాలను చదివి వినిపించారు. ప్రముఖపుణ్యక్షేత్రమైన కొండగట్టు సమీపంలో జరిగిన బస్సుప్రమాదంలో 62 మంది హిందువులు చనిపోతే కనీసం పరామర్శించడానికి రాని కేసీఆర్, ఎన్నికలసమయంలో తానే అసలైన హిందువునని చెబుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాబుమోహన్‌ మాట్లాడుతూ తిమ్మినిబమ్మిని చేసేలా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే మాయలమరాఠి కేసీఆర్‌అని, ఎమ్మెల్సీఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రానున్నాయని అన్నారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు బూస గంగాధర్, నాయకులు రేకులపల్లి రవీందర్‌రెడ్డి, సామల లక్ష్మణ్, అక్కెపల్లి రవిందర్, మేర్గు కిషన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు